logo

భర్తీ కాని ఖాళీలు.. వీడని కరెంటు కష్టాలు

జంగారెడ్డిగూడెం పట్టణవాసులు తరచూ కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీనికి ఇప్పుడు ఆ శాఖలోని సిబ్బంది కొరత కూడా తోడైంది.

Updated : 27 Jan 2023 05:22 IST

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే

పాత తహశీల్దారు కార్యాలయం రోడ్డులో తీగలకు అల్లుకున్న పాదులు

జంగారెడ్డిగూడెం పట్టణవాసులు తరచూ కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీనికి ఇప్పుడు ఆ శాఖలోని సిబ్బంది కొరత కూడా తోడైంది. మరోవైపు అవినీతి వ్యవహారాలతో వినియోగదారులు నష్టపోతున్నారు. ఇటీవల విద్యుత్తు స్తంభం మార్చేందుకు ఇక్కడి జేఎల్‌ఎం జీవరత్నం రూ.20వేలు వసూలు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లడంతో అతడిని అధికారులు సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం ఏఈతో పాటు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కింది స్థాయి సిబ్బంది కొరత కూడా ఉంది. ఇక్కడ విధులు నిర్వర్తించడానికి అధికారులు, ఉద్యోగులు ఐచ్ఛికం ఇవ్వకపోవడంతో భర్తీ కావడం లేదు. 

చింతలపూడి విభాగంలో ఇటీవల 100కుపైగా అంచనాలు పంపితే నిధులు మంజూరయ్యాయి. జంగారెడ్డిగూడెంలో ఆజాడే లేదు. ఫీడర్‌ పరిధిలో ఎక్కడ కరెంటు పోయినా అంతా తీసేస్తున్నారు. ప్రజలకు ఇది తలనొప్పిగా మారింది. ఇటీవల విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు మార్చడానికి ఆరు గంటలకు పైగా సరఫరా నిలిపివేశారు.

* జంగారెడ్డిగూడెం పట్టణంలో 25,501 విద్యుత్తు సర్వీసులు ఉన్నాయి. 12 వేలు దాటితే మరో విభాగం ఏర్పాటు చేయాలి. ఇంత వరకు రెండోది మంజూరు కాలేదు. పైగా ఉండాల్సిన అధికారి (ఏఈ) పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. సబ్‌ ఇంజినీరు సునీతకు అదనపు బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఇక్కడ పనిచేసే ఎల్‌ఐ సురేష్‌ను పశ్చిమగోదావరికి డిప్యుటేషన్‌పై పంపారు. ప్రస్తుతం ఒకరే మిగిలారు. జేఎల్‌ఎం పోస్టులు నాలుగు ఖాళీగా ఉన్నాయి.

చేతులెత్తేస్తూ... అతి పెద్ద విద్యుత్తు విభాగం కావడంతో నిత్యం ఏదో ఒక మూలన  సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని సకాలంలో పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది.ఎక్కడికక్కడ తీగలు  వేలాడుతున్నాయి. కరెంట్‌ పెట్టెలు కాలిపోతున్నాయి. తీగలకు చెట్లు, పాదులు చుట్టుకొని కనిపిస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద భద్రతా చర్యలు లేవు. పనుల  అంచనాలు వేయడంలోనూ వెనుకబాటు కొనసాగుతోంది. ‘విద్యుత్తు ఏఈతో పాటు ఇతర పోస్టుల ఖాళీలు భర్తీ చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. కొత్త విభాగం మంజూరుకు ప్రతిపాదించాం’ అని  ఈఈ  అంబేడ్కర్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు