logo

సమన్వయంతో ప్రగతి పథం

పచ్చని పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి-సంక్షేమ రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు.

Published : 27 Jan 2023 03:47 IST

ఘనంగా గణతంత్ర వేడుకలు

పావురాలను ఎగురవేస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాశ్‌, జేసీ మురళి తదితరులు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: పచ్చని పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి-సంక్షేమ రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు. భీమవరంలోని కలెక్టరేట్‌ వద్ద గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన జిల్లాగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాకు తాను మొదటి కలెక్టర్‌ కావడం గుర్తుండిపోతుందన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా సత్వరం లబ్ధిదారులకు అందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ప్రతి పథకం ప్రజలకు అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

కవాతు చేస్తున్న ఎన్‌సీసీ క్యాడెట్లు

అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

జిల్లా అభివృద్ధికి సంబంధించి చురుగ్గా చర్యలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విలువైన సేవలందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో 2.20 లక్షల మందికి రూ.110 కోట్లను రైతు భరోసాగా అందజేస్తున్నామన్నారు. రుణాలుగా రూ.6,183 కోట్లు అందిస్తున్నామన్నారు.  53,730 మంది కౌలు రైతులకు రుణార్హత కార్డులు అందించి రుణాలు అందించామన్నారు. ఉచిత పంట బీమా పథకం కింద 50,314 మందికి రూ.100 కోట్లు పరిహారం అందించినట్లు వెల్లడించారు. ఖరీఫ్‌లో 63,586 మంది రైతుల నుంచి 3.66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, దానిలో భాగంగా నరసాపురంలో ఆక్వా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన కూడా చేశామన్నారు. 19 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతంలో ఆక్వా సాగు మరింత విస్తరించేలా కృషి చేస్తున్నామన్నారు.

సంక్షేమానికి  పెద్దపీట..

అభివృద్ధితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నామన్నారు. 2,22,974 మందికి ప్రతి నెలా రూ.61కోట్లు అందిస్తున్నామని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే ప్రక్రియ వేగంగా జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలో 601 లేఅవుట్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 72,636 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు.

* మొదట ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై ఎస్పీ రవిప్రకాశ్‌తో కలిసి తిరిగి తర్వాత వేదికపై నుంచి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పావురాలను, బెలూన్లను ఎగురవేశారు

* సంయుక్త కలెక్టర్‌ జేవీ మురళి, ఆర్డీవో దాసి రాజుతో కలిసి అధికారులు, ఉద్యోగులకు అవార్డులు అందజేశారు.

* ఎస్పీ రవి ప్రకాశ్‌ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం శాంతి భద్రతల కోసం బాగా కృషి చేస్తోందంటూ అభినందించారు.కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు, ఎంఎస్‌ఎంఈ ఛైర్మన్‌ వంకా రవీంద్రనాథ్‌, ఎంబీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పెండ్ర వీరన్న, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, సబ్‌కలెక్టర్‌ సూర్యతేజ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

* భీమవరంలోని కలెక్టరేట్‌ వద్ద గురువారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ విద్యా సంస్థల విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు