logo

పందుల సంచారంతో బెంబేలు

తాడేపల్లిగూడెం పట్టణంలో పందుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలో శివారు ప్రాంతాల్లో వీటిని పెంచుకొనేవారు.

Published : 27 Jan 2023 03:47 IST

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే

చనిపోయిన పందులను తరలిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

తాడేపల్లిగూడెం పట్టణంలో పందుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలో శివారు ప్రాంతాల్లో వీటిని పెంచుకొనేవారు. నిర్వహణ భారం అధికమవుతున్న తరుణంలో జనావాసాల మధ్య వదిలేస్తున్నారు. ఖాళీ స్థలాలు, డ్రైయిన్లు, ప్రధాన వీధులు, కూడళ్లు ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవం చేస్తోంది. ఒక వైపు దోమలు విష జ్వరాలను వ్యాప్తి చెందుతుంటే మరో వైపు వింత వైరస్‌ బారిన పడి మృతి చెందిన పందులు మరింత భయాన్ని పెంచుతున్నాయి. కడకట్ల, యాగర్లపల్లి, దొమ్మర్లకాలనీ, బళ్లదొడ్డి, పాతూరు, సుబ్బారావుపేట, గణేష్‌నగర్‌, వీకర్స్‌ కాలనీ, సవితృపేట, మామిడితోట వంటి ప్రాంతాల్లో వీటి సంచారం అధికంగా ఉంటోంది. ఆయా ప్రాంతాల్లో సుమారు 10 వేల పందుల వరకు ఉంటాయనేది అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఎన్ని వరాహాలు వ్యాధి బారిన పడ్డాయనేది ప్రశ్నార్థకం.

నెల రోజుల్లో 1500 మృతి

గత నెల రోజులుగా వింత వైరస్‌ పట్టణంలో కలకలం రేపుతోంది. అయితే ఇది వాటి వరకు మాత్రమే పరిమితం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాధి నివారణకు ఎన్ని రకాల మందులు వాడుతున్నా.. ఫలితం ఉండటం లేదని పెంపకందారులు వాపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో సుమారు 1500 పందుల వరకు మృతి చెందాయని పారిశుద్ధ్య సిబ్బంది చెబుతున్నారు. ఇవి కుళ్లి దుర్వాసన వచ్చే వరకు ఎక్కడ ఉంటున్నాయో తెలియడం లేదు. వీటిని తొలగించడం పారిశుద్ధ్య సిబ్బందికి తలకుమించిన భారం అవుతోంది. ప్రత్యేక వాహనంలో కళేబరాలను తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా 24వ వార్డులో సమస్య తీవ్రత అధికంగా ఉంది. మూడు రోజుల వ్యవధిలో సుమారు 35 పందుల వరకు చనిపోవడం గమనార్హం. ‘వింత వైరస్‌ కారణంగా పందులు మాత్రమే మృతి చెందుతున్నాయి. ఈ వైరస్‌తో ప్రజలకు ఎలాంటి హాని లేదు. పందులను పట్టణానికి దూరంగా తీసుకెళ్లమని పెంపకందారులకు ఆదేశాలు జారీ చేశాం’ అని పారిశుద్ధ్య పర్యవేక్షకుడు అప్పారావు తెలిపారు. 


‘వింత వైరస్‌తో ప్రజలకు ఎలాంటి హాని లేదు. నిబంధనలు పాటించని పెంపకందారులపై  కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని కమిషనర్‌ బాలస్వామి తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని