logo

ప్రేమలో నిలిచి.. గెలిచే!

ఈ చిత్రంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కిన భవానీ ప్రసాద్‌ది విశాఖ. వధువు ఐక్‌వేది మలేసియా. దాదాపు 13 సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెళ్లారు.

Updated : 28 Jan 2023 06:57 IST

ఫలించిన 12 ఏళ్ల నిరీక్షణ
దంపతులైన ఆంధ్రా అబ్బాయి, మలేసియా అమ్మాయి

ఈనాడు, విశాఖపట్నం: ఈ చిత్రంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కిన భవానీ ప్రసాద్‌ది విశాఖ. వధువు ఐక్‌వేది మలేసియా. దాదాపు 13 సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెళ్లారు. అక్కడ వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇరు వైపులా పెద్దలకు తమ మనోగతం వివరించారు. అమ్మాయి తరఫున వారు మాత్రం అంగీకరించలేదు. అయితే.. తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని ఆమె స్పష్టం చేసింది. తనదీ అదే మాట అంటూ.. భవానీ ప్రసాద్‌ కూడా పెళ్లి చేసుకోలేదు. స్నేహితులుగానే ఉండిపోయారు. ఇద్దరూ ఎం.ఎస్‌., పీహెచ్‌డీలు చేసి అక్కడే ఆచార్యులుగా ఉద్యోగాలు తెచ్చుకున్నా ఐక్‌వే కుటుంబ సభ్యుల మనసు మారలేదు. భవానీ ప్రసాద్‌ ఉద్యోగానికి స్వస్తి చెప్పి సొంతంగా వ్యాపారం ప్రారంభించగా ... ఆమె కూడా తన ఉద్యోగం మాని అతని సంస్థలో చేరి వ్యాపార కార్యకలాపాలకు సహకరిస్తున్నారు. ఆ విధంగా 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇద్దరికీ 41 ఏళ్లు వచ్చాయి. ఇటీవలే ఐక్‌వే కుటుంబసభ్యులు వీరి వివాహానికి ఆమోదం తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ శుక్రవారం వీరి వివాహం జరిగింది. విశాఖ నగరానికి చెందిన కోట సూర్యప్రకాశరావు, సీతామహాలక్ష్మి దంపతుల స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని వేడంగి గ్రామం. సూర్యప్రకాశరావు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ అనంతరం 15 ఏళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. ఆయన మూడో కుమారుడు భవానీప్రసాద్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని