logo

వండి వడ్డించడంలో యువ హవా!

భీమవరానికి చెందిన రమేష్‌కు ఆదివారం బిర్యానీ తినాలనిపించింది. గతంలో అయితే ప్రత్యేకంగా సిద్ధమై ద్విచక్ర వాహనంపై పట్టణం మధ్యకు వెళ్తేగాని  కుదిరేదికాదు.

Published : 29 Jan 2023 05:19 IST

విస్తరిస్తున్న ఆహార వాణిజ్యం

క్యాటరింగ్‌లో యువకులు

* భీమవరానికి చెందిన రమేష్‌కు ఆదివారం బిర్యానీ తినాలనిపించింది. గతంలో అయితే ప్రత్యేకంగా సిద్ధమై ద్విచక్ర వాహనంపై పట్టణం మధ్యకు వెళ్తేగాని  కుదిరేదికాదు. ఇప్పుడు ఇంట్లో నుంచి సైగ చేస్తే చాలు వీధి చివరనున్న బిర్యానీ దుకాణం సిబ్బంది వేడివేడిగా తెచ్చి అందిస్తున్నారు. పెరుగుతున్న అభిరుచులు దాన్ని దొరకబుచ్చుకుంటున్న యువత ఉమ్మడి జిల్లాలోని ఆహార వాణిజ్యాన్ని విస్తరింప జేస్తున్నారు. చేతినిండా ఉపాధి పొందుతూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.

* పాలకొల్లుకు చెందిన యువకుడు చోడవరపు దుర్గారావు క్యాటరింగ్‌ వృత్తిలో స్థిరపడ్డారు. ఆయన దగ్గర నిత్యం 50 మంది ఉపాధి పొందుతున్నారు. కొవిడ్‌ తర్వాత క్యాటరింగ్‌ వృత్తికి బాగా డిమాండ్‌ పెరిగిందని అన్‌సీజన్‌లో కూడా నెలకు 15రోజులపైబడే తమకు పని లభిస్తోందని దుర్గారావు చెప్పారు.

పాలకొల్లు, న్యూస్‌టుడే: కొత్తగా జిల్లా కేంద్రంగా ఏర్పడిన భీమవరంలో ప్రస్తుతం 500 వరకు బిర్యానీ పాయింట్లు ఉన్నాయంటే నమ్మక తప్పదు. వీటిలో 70 శాతం యువత ఆధ్వర్యంలో నడుస్తున్నవే. ఏలూరు నగరంలో లాక్‌డౌన్‌కు ముందు 70 వరకు కర్రీ పాయింట్లు ఉండేవి. ప్రస్తుతం 150కి పైబడి ఉన్నాయి. వీటిలో చాలా వరకు మహిళలే నడుపుతున్నా అధిక సంఖ్యలో యువతులున్నారు. నగరంలోని పాత బస్టాండ్‌ నుంచి కొత్త బస్టాండ్‌ వరకు రెండేళ్ల కిందట 10 నుంచి 12 రెస్టారెంట్లు ఉండగా ప్రస్తుతం 30 దాటాయి. ఉదయం, సాయంత్రం అల్పాహారం విక్రయించే మొబైల్‌ సెంటర్లకు లెక్కే లేదంటే వంటశాలలు, హోటళ్ల వ్యాపారంలో యువ హవా అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్‌ తర్వాత నూతన సంవత్సరం, సంక్రాంతి నేపథ్యంలో కొత్త రెస్టారెంట్ల వ్యాపారం మూడు పార్శిళ్లు ఆరు ఆర్డర్ల చందాన కొనసాగుతోంది. మిఠాయిల తయారీలోనూ పలువురు యువత ఇంట్లో మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఆహారమేకాదు ఆర్డరిస్తే ఫలహారాలు, అల్పాహారాలను కూడా అరటాకు నుంచి నీళ్ల సీసా వరకు అన్నీ  సరఫరా చేస్తున్నారు.

పెరిగిన ఉపాధి..

ఆహార దుకాణాల విషయంలో కొవిడ్‌ - 19కు ముందు.. ఆ తర్వాత అని చెప్పుకోవాలి. యలమంచిలి మండలం దొడ్డిపట్ల నుంచి పాలకొల్లు వరకు 15 కి.మీ. దూరంలో ప్రధాన రహదారి పొడవునా రెండు మూడు హోటళ్లు 2019 వరకు ఉన్నాయి. ప్రస్తుతం పరిశీలిస్తే సుమారు 10కి పైగానే వెలిశాయి. ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా ఆహారాన్ని బుక్‌ చేసుకునే సౌలభ్యం ఉన్న భీమవరం, ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో వందల మంది యువత డెలివరీ ఉద్యోగాల్లో ఉపాధి పొందుతున్నారు. పాలకొల్లులో ఆన్‌లైన్‌ డెలివరీ అందుబాటులోకి రాకపోయినా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తున్న డెలివరీ కుర్రాళ్లు ఉపాధి పొందుతున్నారు. వంటలు చేసే నలభీములకు గిరాకీ పెరిగింది. జిల్లాలోని ప్రతి పల్లె నుంచి పట్టణాల వరకు గతంతో పోలిస్తే ఆహార వ్యాపారం ఈ రెండేళ్లలో 50 శాతంపైగా పెరిగిందనేది అంచనా.

దృక్పథం మారింది...

వివిధ రంగాల్లో ఉపాధి కోల్పోయిన వారు, గల్ఫ్‌ దేశాల నుంచి తిరిగొచ్చేసిన యువత వల్ల బిర్యానీ పాయింట్లు, రెస్టారెంట్లు పెరుగుతూ వచ్చాయని చించినాడకు చెందిన మల్లుల శ్రీనివాస్‌ చెప్పారు. రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలతో ఇంట్లో తయారు చేసుకునే కన్నా కర్రీ పాయింట్లలో అవసరం మేరకు  తెచ్చుకుంటే సరిపోతుందనే భావన ఇటీవల చాలా కుటుంబాల్లో రావడం.. యువత ఆహార వాణిజ్యంలోకి దిగడానికి కారణమైందని పాలకొల్లుకు చెందిన ఆరిమిల్లి వెంకటరమణ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని