logo

ఆరోగ్య భాగ్యాల ఆదిత్యా.. నమో నారసింహాయ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనృసింహస్వామివారి పరిణయోత్సవాలు శనివారం ఘనంగా సాగాయి.

Updated : 29 Jan 2023 06:24 IST

స్వామి రథాన్ని  మెరకవీధికి తరలిస్తున్న భక్తులు

న్యూస్‌టుడే, అంతర్వేది, మామిడికుదురు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనృసింహస్వామివారి పరిణయోత్సవాలు శనివారం ఘనంగా సాగాయి.  సిరుల తల్లితో సూర్యప్రభ వాహనంపై తరలివచ్చిన స్వామివారి ఉత్సవ వైభవం భక్తుల కళ్లల్లో కాంతులీనింది. పురవీధుల్లోంచి అభయ ప్రదానం చేస్తూ చిద్విలాసంగా తరలివచ్చే స్వామిని దర్శించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి అంతా సుఖసంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం. ఆలయంలో స్వామికి ఉదయం సుప్రభాత సేవ, తిరువారాధన, అభిషేకం, బాలభోగ నివేదన అనంతరం నారసింహ సుదర్శన హోమం జరిగింది.  ఆలయం చెంతనున్న రథాన్ని భక్తులు మెరకవీధికి తరలించారు.  రాత్రి  స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ముద్రికాలంకరణతో నూతన వధూవరులుగా తీర్చిదిద్దారు.


కనుల పండువగా శాంతి కల్యాణం

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: శోభనాచల వ్యాఘ్రలక్ష్మీ నరసింహస్వామి మాఘమాస రథసప్తమి వేడుకలు, శాంతి కల్యాణం శనివారం వైభవంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్రలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది. కొండపైన మూడు గుళ్ల వద్ద   స్వామి వారికి పూజలు చేశారు. కొండపై వరకు మెట్లకు పసుపు, కుంకుమతో పూజలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు స్వామి వారి శాంతి కల్యాణం జరిగింది. రాత్రి చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం కనుల పండువగా సాగింది.  అనంతరం స్వామివారి కల్యాణ మండపంలో ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 11 గంటలకు స్వామి, గోదా అమ్మవార్లకు దివ్య తిరు కల్యాణం, రాధాకృష్ణుల కల్యాణం, కొట్నాల సేవ, విశేష పుష్పాలంకరణ, ఊంజల సేవలు నిర్వహించారు.


సూర్య, చంద్రప్రభ వాహనాలపై శ్రీనివాసుడు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల చినవేంకన్న ఆలయంలో రథ సప్తమి వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు.  ఉదయం సూర్య ప్రభ వాహనంపై స్వామివారి కోవెల ఉత్సవం చేశారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. అర్చకులు, పండితులు హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై(పక్క చిత్రంలో) ఆలయ ప్రాంగణంలో విహరించారు. సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని