logo

మాఫియా మాయాజాలం

కైకలూరు మండల వ్యాప్తంగా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మట్టి మాఫియా పొలాలు, చెరువులు, ఖాళీ స్థలాల్లో పొక్లెయిన్లతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి, టిప్పర్లు, ట్రాక్టర్లతో బయటకు తరలిస్తోంది.

Published : 29 Jan 2023 05:19 IST

యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు

గుమ్మళ్లపాడు పాఠశాల సమీపంలో చెరువులో అక్రమ తవ్వకాలు

కైకలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కైకలూరు మండల వ్యాప్తంగా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మట్టి మాఫియా పొలాలు, చెరువులు, ఖాళీ స్థలాల్లో పొక్లెయిన్లతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి, టిప్పర్లు, ట్రాక్టర్లతో బయటకు తరలిస్తోంది. మండలంలోని వేమవరప్పాడు, అయోధ్యపట్నం, సీతనపల్లి, వదర్లపాడు, రామవరం, పందిరిపల్లెగూడెం, గుమ్మళ్లపాడు గ్రామాల్లో అక్రమార్కులు ఈ తరహా తవ్వకాలు చేపడుతున్నారు. అధికారపార్టీ నాయకుల అండదండలతో పగలూరాత్రీ తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

అక్రమార్కులకు కాసుల వర్షం

నిబంధనలకు విరుద్ధంగా పంట పొలాలను ఆక్వా చెరువులుగా మారుస్తున్నారు. సర్కారుకు నాలా పన్ను చెల్లించకుండా ట్రాక్టరు ట్రక్కు మట్టి రూ.వెయ్యి నుంచి రూ.1200, టిప్పర్లను రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. రెవెన్యూ, గనులశాఖ అధికారులు వీరిని అదుపు చేయకపోవడంతో మట్టి వీరి పాలిట కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి మాత్రం భారీగా గండి పడుతోంది.

నిబంధనలను విస్మరించి ట్రాక్టర్లలో రవాణా

అతివేగంతో ఆందోళన

మట్టి తరలింపునకు వినియోగిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్ల వేగానికి అడ్డూఅదుపూ లేకపోవడంతో గ్రామీణప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఇరుకు మార్గాల్లోనూ మితిమిరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. వృద్ధులు, చిన్నారులతో బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. డ్రైవింగు లైసెన్సు లేని మైనర్లతోనూ వాహనాలు నడిపిస్తున్నారు. వాహనాలపై పరదాలు వంటివి కప్పకపోవడంతో దుమ్ములేచి వాహనదారులు అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో రోడ్లు  గుంతల మయంగా మారుతున్నాయి. దీనిపై తహసీల్దార్‌ మురళీకృష్ణను సంప్రదించగా జాతీయరహదారి విస్తరణ పనులకు 15 కి.మీ. పరిధిలో మాత్రమే మట్టి తవ్వకాలకు అనుమతులు జారీ చేశామని, ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తక్షణమే తవ్వకాలు నిలుపుదల చేయాలని ఆర్‌ఐ, వీఆర్వోలకు ఆదేశిస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని