logo

వద్దండి.. ఇక్కడికి రాకండి!

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ  శస్త్రచికిత్సలు మరిచారు.

Published : 01 Feb 2023 05:18 IST

చాలా ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నిలిచిన కు.ని.శస్త్రచికిత్సలు

ఏలూరు టూటౌన్‌,  ఆకివీడు, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆసుపత్రుల్లో కుటుంబ నియంత్రణ  శస్త్రచికిత్సలు మరిచారు. కొవిడ్‌ ఉద్ధృతికి ముందు నుంచి ఇప్పటికీ అనుమతులు రాకపోవడంతో సేవలు నిలిచాయని కొన్నిచోట్ల సిబ్బంది చెబుతున్నారు. గతంలో నెలకు 15 నుంచి 20కి పైగా శస్త్రచికిత్సలు చేసేవారు. అలాంటి కొన్ని ఆసుపత్రుల్లో  ఈ గదులకు తాళం వేశారు.

* ఆకివీడుకు చెందిన ఓ బాలింత రెండో కాన్పు అనంతరం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం సమీపంలోని సీహెచ్‌సీకి వెళ్లారు. ఇక్కడ అలాంటి సేవలు లేవన్నారు. పాలకోడేరు, కొణితివాడలో చేస్తున్నట్టున్నారు. అక్కడికి తీసుకెళ్లండని పంపించేశారు.

* ఏలూరు జిల్లా గణపవరం, పిప్పరలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కొవిడ్‌ ఉద్ధృతి నుంచి శస్త్రచికిత్సలు నిలిచాయి. 20 కిలో మీటర్ల దూరంలోని తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది.

* ఏదీ ప్రోత్సాహం.. శస్త్రచికిత్స చేయించుకునే మహిళలకు రూ.1100, పురుషులకు రూ.600 ఇవ్వాలి.  సకాలంలో రావడం లేదని బాధితులు వాపోతున్నారు. కొన్ని చోట్ల దీనికి సంబంధించి సమాచారం ఇచ్చేవారే ఉండటం లేదని వాపోతున్నారు.

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు పలు ప్రాంతాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రులకు వస్తున్నవారంతా వెనుదిరిగి వెళ్తున్నారు. ఆసుపత్రుల్లోని పరికరాలు శస్త్రచికిత్సలను మరిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి రూ.వేలు చెల్లించి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. కాన్పు కష్టమై.. అవసరమైనప్పుడు కొందరికి అదే సమయంలోనే కు.ని శస్త్రచికిత్స చేస్తున్నారు. సాధారణ ప్రసవమైన తర్వాత 5 లేదా 7వ రోజున శస్త్రచికిత్స చేస్తారు. ఇలా  చేయించుకున్నవారికి గతంలో నగదు ఇచ్చి ప్రోత్సహించేవారు. కుటుంబ నియంత్రణ చికిత్స గదులు మాత్రమే దర్శనమిస్తున్నాయని, అక్కడ ఉండాల్సిన వైద్య, సిబ్బంది ఎక్కడ ఉంటున్నారో తెలియడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

మూడేళ్లుగా  తెరవలేదు

భీమవరం ప్రభుత్వాసుపత్రికి పలు ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం నిత్యం వస్తున్నారు. కనీసం సమాచారం ఎక్కడ ఇస్తున్నారో తెలియకుండా ఉంది. వైద్యులు, హెడ్‌ నర్సు, స్టాఫ్‌నర్సు, హెల్త్‌విజిటర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఎంఎన్‌వో ఉంటారు. మూడేళ్ల క్రితం నుంచి కు.ని.శస్త్రచికిత్స గదులు మూసేశారు. వైద్య, సిబ్బంది సేవలు వ్యాక్సిన్లు ఇవ్వడానికే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సమాచారమే లేదు

గతంలో ఏ రోజు ఎక్కడ కు.ని శస్త్రచికిత్సలు చేస్తున్నారో సమాచారం ఇచ్చేవారు. ప్రస్తుతం చాలా చోట్ల సేవలు నిలిచాయి. ఎక్కడ చేస్తారంటే సమాధానం చెప్పేవారు ఉండటంలేదని పలువురు వాపోతున్నారు. ఈ విషయమై పశ్చిమగోదావరి డీఎంహెచ్‌వో మహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రులన్నింటిలో కు.ని శస్త్రచికిత్సలు చేయాల్సిందేనన్నారు. సేవలు నిలిచినచోట అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొందరు వైద్యులకు శిక్షణ ఇప్పించామని, వీరంతా ఆయా కేంద్రాల్లో శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఏలూరు ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో నాగేశ్వరరావు చెప్పారు.


వేరొక చోటకు వెళ్లా

భీమవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రసవమైంది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం మా కుటుంబ సభ్యులు సంబంధిత విభాగంలో అడిగారు. ప్రస్తుతం ఇక్కడ చేయడంలేదన్నారు. ఉండి మండలం యండగండి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నా.

కె.మహాలక్ష్మి, గరగపర్రు


ఆర్థిక ఇబ్బందులు భరించలేక..

రెండో కాన్పు అనంతరం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం పలు ఆసుపత్రులకు వెళ్లా. కొవిడ్‌ తగ్గిన తర్వాత సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అలా కొన్ని నెలలు గడిచిపోయింది. తర్వాత వెళ్తే ప్రసవమై చాలా నెలలు కావడంతో శస్త్రచికిత్స కష్టమన్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే రూ.35 వేల నుంచి రూ.45 వేలు అవుతుందన్నారు.

ఓ మహిళ, భీమవరం


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని