logo

పురపాలక స్థలం పరాధీనం!

నరసాపురం పురపాలక పరిధిలో రూ.కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురవుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

Published : 01 Feb 2023 05:18 IST

రూ.కోట్ల విలువైన భూమిలో ప్రైవేటు లేఅవుట్‌

ప్రభుత్వ స్థలంలో  రహదారి, హద్దులకు నిర్మించిన కాంక్రీటు స్తంభాలు

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం పురపాలక పరిధిలో రూ.కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురవుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని 25వ వార్డు ఆదర్శనగర్‌ కాలనీని సుమారు పదేళ్ల కిందట ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పేదలకు పంపిణీ చేసిన స్థలాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుని వాటిలోనే నివసిస్తున్నారు. పంపిణీ చేయగా సుమారు ఇరవై సెంట్ల స్థలం మిగిలి ఉంది. ఆ స్థలానికి చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతో కబ్జాకు గురైంది. ఈ ప్రాంతంలో సెంటు ధర సుమారు రూ.8 లక్షల వరకు ఉంటుందని.. ఆక్రమణకు గురైన స్థలం విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల మిగులు స్థలానికి సమీపంలో ఉన్న ప్రైవేటు భూమిని కలిపి యజమానులు ప్లాట్లుగా విభజించారు. ఆ ప్లాట్లకు వెళ్లేందుకు ప్రభుత్వ స్థలంలో రహదారి నిర్మించారు. అక్కడితో వదలకుండా ప్రభుత్వ స్థలాన్ని కూడా విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తులు దాని సరిహద్దుల్లో కాంక్రీటుతో స్తంభాలు నిర్మించుకున్నారు. ఈ విషయమై కౌన్సిలర్‌ వన్నెంరెడ్డి శ్రీనివాస్‌ మంగళవారం నాటి పురపాలక సమావేశంలో అధికారులను నిలదీశారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి శేషగిరిని సమాచారం కోరగా ఆక్రమణలను వెంటనే తొలగించి, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని