logo

ఆకివీడు కౌన్సిల్‌ సమావేశం రసాభాస

ఆకివీడు నగర పంచాయతీ సమావేశం అధికార, ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యుల వాగ్వాదాలతో రసాభాసగా మారింది.

Published : 01 Feb 2023 05:18 IST

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు నగర పంచాయతీ సమావేశం అధికార, ప్రతిపక్ష కౌన్సిల్‌ సభ్యుల వాగ్వాదాలతో రసాభాసగా మారింది. మంగళవారం  ఛైర్‌పర్సన్‌ జామి హైమావతి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. వార్డుల వారీగా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు వివరాలు తెలియజేస్తుండగా ప్రతిపక్షానికి చెందిన తెదేపా, జనసేన మహిళా కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, బత్తుల శ్యామల, కిమిడి అరుణకుమారి, మోపిదేవి సత్యవతి, నేరెళ్ల ప్రసన్న, గోపిశెట్టి సత్యవతిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా వైకాపా నాయకులు సూచనల మేరకు తమ వార్డులకు నిధులు కేటాయించడమేమిటని కమిషనర్‌ తిరుమలరావును ప్రశ్నించారు. ఆయన స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో సమావేశ మందిరంలో నేలపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఒక పక్క వారు నిరసన తెలుపుతుండగానే వైకాపా కౌన్సిలర్లు ఎజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించి  వెళ్లిపోయారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు కొంతసేపు అక్కడే నిరసన కొనసాగించారు. ఆకివీడు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఛైర్‌పర్సన్‌ హైమావతి తెలిపారు. సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ  ఇకపై  కౌన్సిలర్లతో చర్చించి, వారి సూచనల మేరకు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పక్షపాతం చూపిస్తున్నారు..

తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా తమపై ఓడిపోయిన వైకాపా అభ్యర్థులను ఆయా వార్డుల్లో వైకాపా ఇన్‌ఛార్జులుగా నియమించి వారు సూచించిన పనులకు నిధులు కేటాయించి, వారి ఆధ్వర్యంలో పనులు చేయించేలా కుట్ర చేస్తున్నారని తెదేపా, జనసేన కౌన్సిలర్లు ఆరోపించారు. గతంలో పన్నుల వసూళ్లలో జరిగిన అవకతవకలకు సంబంధించి రూ.13 లక్షలు తిరిగి జమచేయించామని చెప్పినా.. ఇప్పటికీ పన్నులు చెల్లించిన వారి ఖాతాల్లో జమ కాలేదన్నారు. అవినీతి అవకతవకలపై విజిలెన్స్‌తో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మహిళా కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, బత్తుల శ్యామల,  అరుణకుమారి, నేరెళ్ల ప్రసన్న తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని