logo

సాంస్కృతిక వేదిక.. సాంకేతిక దీపిక

విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞాన ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్‌లో ఉల్కన్‌జీ-2023 టెక్నో కల్చరల్‌ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Published : 01 Feb 2023 05:18 IST

ఉల్క్‌న్‌జీ-2023 వేడుకలకు సిద్ధమవుతున్న నిట్‌

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞాన ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్‌లో ఉల్కన్‌జీ-2023 టెక్నో కల్చరల్‌ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెంలో నిట్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 23, 24, 25 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు.  ఇటీవల స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డీన్‌  జీబీ వీరేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ‘కర్టెన్‌ రైజర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి రోజూ పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు.

ప్రతిభకు చుక్కాని.. దేశం పురోగతి సాధించాలంటే ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాల్సిందే. విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు ఈ వేడుకలు ఎంతో దోహదం చేస్తాయి. సాంకేతిక పరంగా సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలను ప్రదర్శించే వెసులుబాటు ఉంటుంది. గతంలో నిర్వహించిన డ్రోన్‌ రేస్‌, రోబో ఛాంపియన్‌, హ్యూమన్‌ లీడ్‌లు వంటి కార్యక్రమాలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది కూడా ఆ తరహాలో కార్యక్రమాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. సంస్థలోని మూడు వేల మంది విద్యార్థులతో పాటు జిల్లాలోని వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు  హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయా కళాశాలలకు ఏపీ నిట్‌ నుంచి ఆహ్వానాలు వెళ్లాయి.  సాంస్కృతిక ప్రదర్శనల్లో భాగంగా కూచిపూడి, జానపదం, భరతనాట్యాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.  ‘నిట్‌ ప్రాంగణంలో ఉల్కన్‌జీ-2023 సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనే విధంగా పలు సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నాం. సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం’ అని స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డీన్‌ డాక్టర్‌ జీబీ వీరేష్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని