logo

బాలుడి గాయం మానుతుందంటూ పెట్రోల్‌ పోసి నిప్పంటించారు!

ఓ బాలుడి కాలికి అయిన గాయం మానుతుందంటూ దానిపై ఇద్దరు యువకులు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన  జంగారెడ్డిగూడెంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

Updated : 01 Feb 2023 05:26 IST

కార్తిక్‌ను పరామర్శిస్తున్న ఆర్డీవో ఝాన్సీరాణి తదితరులు

జంగారెడ్డిగూడెం పట్టణం, జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఓ బాలుడి కాలికి అయిన గాయం మానుతుందంటూ దానిపై ఇద్దరు యువకులు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన  జంగారెడ్డిగూడెంలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన బాధిత బాలుడు తగరం కార్తిక్‌ పరిస్థితిని కొందరు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు జరిగిన ఘటనపై ఆర్డీవో ఝాన్సీరాణి మంగళవారం రాత్రి విచారణ చేపట్టి.. బాలుడు, అతడి తల్లి రామలక్ష్మి నుంచి వివరాలు సేకరించారు. గతంలో కార్తిక్‌ తల్లిదండ్రులతో కలిసి జీడి గింజల పరిశ్రమలో పనిచేసేవారు. ఐదురోజుల నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ పకోడీ దుకాణంలో పనికి వెళుతున్నాడు. అప్పటికే అతడి కాలికి గాయం ఉంది. ఆదివారం రాత్రి తాండ్ర పాపారాయుడు విగ్రహం ప్రాంతంలో పకోడి దుకాణదారుడి ఇంటి వద్ద తన గాయం తగ్గుతుందంటూ నాగు, ఖాసిం అనే యువకులు పెట్రోలు పోసి నిప్పంటించారని అధికారులకు తెలిపాడు. అనంతరం తనను ఇంటి వద్ద దించి విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని చెప్పాడు. మరోవైపు బాలుడికి అయిన గాయం తీవ్రం కావడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. తాను దుకాణంలో ఉండగా వేడి నూనె ఒంటిపై పడటంతో గాయమైందని ఆసుపత్రిలోని పోలీసులకు సోమవారం కార్తిక్‌ ఫిర్యాదు చేశాడని జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్సై సాగర్‌బాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని