logo

నాడున్న మరుగూ నేడు లేదాయె!

20 శాతంతో సరి... నాడు-నేడు పనులు ప్రారంభించడానికి మొదట విడుదల చేసిన 20 శాతం రివాల్వింగ్‌ ఫండ్‌ తర్వాత మళ్లీ రూపాయి విడుదల చేసింది లేదు.

Published : 01 Feb 2023 05:18 IST

వేలాది బస్తాల సిమెంట్‌ వృథా
పాఠశాలల్లో 2వ విడత పనుల పరిస్థితి

గంగడపాలెంలో అసంపూర్తిగా మరుగుదొడ్డి నిర్మాణం

20 శాతంతో సరి... నాడు-నేడు పనులు ప్రారంభించడానికి మొదట విడుదల చేసిన 20 శాతం రివాల్వింగ్‌ ఫండ్‌ తర్వాత మళ్లీ రూపాయి విడుదల చేసింది లేదు. 2021 ఆగస్టులో మొదలైన రెండో విడత పనులు 2023 వేసవి సెలవులు సమీపిస్తున్నా పునాది దశ దాటకపోవడం గమనార్హం. జిల్లాలో మొత్తం 726 పాఠశాలల్లో 39 జూనియర్‌ కళాశాలల్లోను ఈ పనులు ప్రతిపాదిత నిధులతో ప్రారంభమయ్యాయి. ఉన్న నిధులన్నీ ఆరంభ పనులకే వెచ్చించడం తర్వాత కనీసం కూలీ ఖర్చులు కూడా విడుదల చేయక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

అధికారుల అత్యుత్సాహం

రివాల్వింగ్‌ ఫండ్‌ 20 శాతం పాఠశాల ఖాతాలకు జమైనప్పుడు కొంత నిల్వచేసి అత్యవసరమైన మరుగుదొడ్లు వంటి పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఎక్కడా అలాచేయలేదు. ఉన్న మొత్తం వెచ్చించి ఇనుము, ఇటుకలు, ఇసుక, ఇతరాత్ర మెటీరియల్‌ను అధికారులు అన్నిచోట్లా దించేశారు. దీనివల్ల ఇనుము తుప్పు పడుతుండగా ఇసుక వర్షాలకు చాలావరకు కొట్టుకుపోయిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పనులు ప్రారంభించకుండానే ఎందుకిలా అంటే ఆయా డీలర్ల నుంచి వచ్చే కమీషన్‌ కొరకు కక్కుర్తేనని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లాలో నాడు-నేడు పనుల పర్యవేక్షణాధికారి మధును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా విద్యాశాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాష్‌ ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా పలు పాఠశాలల్లో పరిస్థితిని పరిశీలించారని చెప్పారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని వెల్లడించారు.


గడ్డ కట్టిన సిమెంట్‌

ముందు చూపులేక చేసే పనులతో నష్టం తప్పదని రెండో విడత పనులు నిరూపిస్తున్నాయి. ఎంపికైన ప్రతి పాఠశాలకు 150 నుంచి 200 సిమెంట్‌ బస్తాలు దిగుమతి చేశారు. ఇవన్నీ ప్రస్తుతం సిమెంట్‌ గడ్డకట్టేసి పనికిరాని స్థితికి చేరాయి. వాస్తవానికి ఒక సిమెంట్‌ బస్తా కొనుగోలు చేశాక కనీసం 90 రోజుల్లో వినియోగించాల్సి ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏడాది దాటిపోవడంతో ఒక్కో మండలానికి సరాసరిన 5 వేల బస్తాలకు పైబడి సిమెంట్‌ వృథాగా మారిందని అంచనా. దీనిని విలువ కడితే ప్రతి మండలంలోనూ రూ.15 లక్షల ప్రజాధనం నిరుపయోగంగా మారినట్టేనని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని