logo

మొవ్వు కుళ్లు.. రైతుల్లో గుబులు!

మెట్ట ప్రాంత వరి చేలకు మొవ్వుకుళ్లు తెగులు సోకడంతో దుబ్బులు ఎండిపోయి మొక్కలు నిలువునా చనిపోతున్నాయి.

Updated : 01 Feb 2023 05:25 IST

నిలువునా ఎండుతున్న రబీ వరి చేలు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: మెట్ట ప్రాంత వరి చేలకు మొవ్వుకుళ్లు తెగులు సోకడంతో దుబ్బులు ఎండిపోయి మొక్కలు నిలువునా చనిపోతున్నాయి. వాటిని బతికించుకునేందుకు రైతులు రకరకాల పురుగు మందులు, గుళికలు పిచికారీ చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. నాట్లు వేసి నెల దాటినా మొక్కల్లో కనీస ఎదుగుదల లేకపోవడంతో నారు అందుబాటులో ఉన్న వారు చేలను దున్నేసి తిరిగి కొత్తగా నాట్లు వేస్తున్నారు.

లక్కవరం, గురవాయిగూడెం, చక్రదేవరపల్లి, నాగులగూడెం, పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో ఎంటీయూ 1121 రకం వరి సాగు చేస్తున్నారు. ఇక్కడ వందల ఎకరాల్లో తెగులు సమస్య తీవ్రంగా ఉంది. అసలు పంట పండుతుందా లేదా అన్న భయం కర్షకులను వెంటాడుతోంది. ఇక కౌలుదారుల పరిస్థితి చెప్పనవసరం లేదు.


ఎకరం చేను దున్నేశా..

‘గురవాయిగూడెంలో నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. మొవ్వు తెగులు సోకి ఎక్కడికక్కడ మొక్కలు కుళ్లిపోతున్నాయి. రెండు సార్లు గుళికలు వేశా. మూడు పర్యాయాలు పురుగు మందులు పిచికారీ చేశా. అయినా ఫలితం లేదు. ఎకరం   చేను దున్నేసి మళ్లీ నాట్లు వేశా. ఎకరానికి రూ.25వేల  వరకు పెట్టుబడి అయ్యింది’ అని లక్కవరానికి చెందిన రైతు దల్లి అంజేశ్వరరావు తెలిపారు.

గురవాయిగూడెంలో  కుళ్లు తెగులుతో దున్నేసి మళ్లీ వరినాట్లు వేసిన పొలం


బతికించుకోవడానికి తీవ్ర ప్రయత్నం

‘ఆరెకరాల్లో వరి వేశా. తెగులు తీవ్రంగా ఉంది. గుళికలు ఎకరానికి నాలుగు కేజీల  చొప్పున వేశా.   పురుగు మందులు మూడు సార్లు పిచికారీ చేశా.   అయినా పంట దక్కుతుందో లేదో అన్న భయం ఉంది. బతికించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా’ అని గురవాయిగూడేనికి చెందిన కోనే సుధాకరరావు వాపోయారు.


ఇలా చేయండి

‘లక్కవరంలో సుమారు 200 ఎకరాల్లో మొవ్వుకుళ్లు తెగులు సోకింది. తెగుళ్ల కారణంగా దున్నేసి మళ్లీ నాట్లు వేసిన విషయం నా దృష్టికి రాలేదు. ప్లాంటో మైసిన్‌ ఒక గ్రాము, కొసైడ్‌ రెండు గ్రాముల చొప్పున ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి’అని వ్యవసాయ శాఖ కేఆర్‌పురం ఏడీ బుజ్జిబాబు తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని