logo

వృక్ష విలాపం!

చాలా ప్రాంతాల్లో విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ విభాగాల వారు నిర్వహణ పేరుతో తరచూ అడ్డుగా ఉన్న కొమ్మలు కొట్టేస్తూ ఉంటారు.

Published : 01 Feb 2023 05:18 IST

నిర్వహణ పేరుతో చెట్లు నరికివేత

పట్టించుకోని యంత్రాంగం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే-జంగారెడ్డిగూడెం

నరికిన చెట్లను ట్రాక్టర్‌పైకి ఎక్కిస్తున్న కూలీలు

విద్యుత్తు తీగలకు అడ్డు వస్తున్నాయి.. రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నాయన్న సాకుతో అక్రమంగా చెట్లను నరికేస్తున్నారు. రహదారి నిర్వహణ పేరుతో కొమ్మలు నరకాల్సింది పోయి చెట్లు నరికి దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

చాలా ప్రాంతాల్లో విద్యుత్తు, ఆర్‌అండ్‌బీ విభాగాల వారు నిర్వహణ పేరుతో తరచూ అడ్డుగా ఉన్న కొమ్మలు కొట్టేస్తూ ఉంటారు. ఎక్కడైనా విద్యుత్తు తీగలకు అడ్డు వచ్చిన చోట్ల ఒకటీ అర నరకటం పరిపాటి. ఈ వంకతో ఇష్టారాజ్యంగా కొమ్మలతోపాటు చెట్లను కూడా నరికేస్తున్నారు. సోమవారం ఏలూరులో పార్కు వద్ద ఇలానే చెట్లను నరికేశారు. గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లు, లారీల్లో సర్దుకుని ఇటుకల బట్టీలు, పొగాకు బేరన్లు, శ్మశానవాటికలకు తరలించేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా దెందులూరు, పెదవేగి. ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారి, ముసునూరు నూజివీడు రహదారి, టి.నరసాపురం, కామవరపుకోట, చింతలపూడి మండలాల్లో యథేచ్ఛగా సాగుతోంది. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతున్నా మామూళ్ల మత్తులో మిన్నకుంటున్నారు.

నిబంధనలు బేఖాతరు

చెట్లు నరికేందుకు పంచాయతీలో తీర్మానం చేయాలి. అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. అనుమతులు తీసుకున్నాక చెట్లు నరకాలి. వాటిని బహిరంగ వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ ఖాతాలో జమచేయాలి. ఈ నిబంధనలు కాగితాల్లో తప్ప కార్యరూపం దాల్చటం లేదు. బహిరంగంగా చెట్లు నరికేసినా పంచాయతీ, పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చనిపోయిన చెట్లు నరికేందుకు అనుమతులు తీసుకుని బతికున్న చెట్ల ఉసురుతీస్తున్నారు. చెట్లు నరికేందుకు పెదవేగి, దెందులూరు మండలాల్లో ప్రత్యేక బృందాలున్నాయి. జిల్లాలో ఎక్కడ చెట్లు నరకాలన్నా వీరికి చెబితే చాలు రాత్రికి రాత్రి నరికి తరలించేస్తారు. ఈ విషయంపై జేసీ అరుణ్‌బాబు వివరణ కోరగా అనుమతులు లేకుండా చెట్లు నరకటం నిబంధనలకు విరుద్ధమని క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఇది ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారిలోని బొర్రంపాలెం అడ్డరోడ్డులో నరికేసిన చెట్టు. దీనికి వందేళ్ల వయస్సు ఉంటుందని అంచనా కొన్ని రోజుల క్రితం దీన్ని నరికి మూడో కంటికి తెలియకుండా తరలించేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని తొలగించామని అధికారులు చెబుతున్నారు.


జంగారెడ్డిగూడెం పట్టణంలో చెట్లు నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. జంగారెడ్డిగూడెం - బుట్టాయగూడెం రోడ్డు వెంబడి ఇటీవల పెద్ద ఎత్తున చెట్లు నరికేశారు. పట్టణంలోని మార్కండేయపురం పరిధిలోని మంచినీటి ట్యాంకుకు 24 గంటల విద్యుత్తు లైన్‌ నిర్మాణం కోసం చేస్తున్నట్లు చెబుతున్నారు. విద్యుత్తు లైన్‌ కోసం నిబంధనల ప్రకారం కొమ్మలు నరకాలి. ఇక్కడ మాత్రం చెట్లు నరికేసి భారీ ఎత్తున కలప పోగేశారు.


* ఆర్‌అండ్‌బీ నూజివీడు సెక్షన్‌ పరిధిలో చనిపోయిన చెట్లు నరికేందుకు రూ.7080 చెల్లించగా రసీదు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే చనిపోయిన చెట్లు నరికేందుకు అనుమతి తీసుకుని బతికున్న చెట్లను నరుక్కుని ట్రాక్టర్ల ద్వారా ఇటుకల బట్టీలకు తరలించేస్తున్నారు. రసీదులో ఎన్ని రోజుల్లో నరకాలి, ఎన్ని చెట్లు నరకాలి..అన్న వివరాలు లేవు. దీంతో నామమాత్రపు రుసుము చెల్లించి టన్నుల కొద్దీ చెట్లు అక్రమంగా తరలిస్తున్నారు. ఈ వ్యవహారం నూజివీడు పరిధిలోని లీలానగర్‌ ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా జోరుగా సాగుతోంది.


* రెండు నెలల క్రితం దెందులూరు మండలం కొవ్వలిలో మంచినీటి చెరువు చుట్టూ ఉన్న సుమారు 32 చెట్ల అనుమతులు, తీర్మానాలు లేకుండా రాత్రికి రాత్రే నరికి తరలించారు.. దీనిపై పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ అధికారులు విచారణ కూడా చేయకుండా తెరమరుగు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని