logo

పురాల్లో ఆక్రమణల పర్వం!

ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. నరసాపురంలో 20 సెంట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైన వ్యవహారంపై ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో సంబంధిత కౌన్సిలర్‌ అధికారులను నిలదీశారు.

Updated : 02 Feb 2023 06:33 IST

సామాజిక స్థలాలకు కొరవడిన రక్షణ

భీమవరం పట్టణం, ఆకివీడు, జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. నరసాపురంలో 20 సెంట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైన వ్యవహారంపై ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో సంబంధిత కౌన్సిలర్‌ అధికారులను నిలదీశారు. ఆకివీడు, భీమవరం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లోనూ ఈ తరహా కబ్జా వ్యవహారాలు గతంలో వెలుగుచూశాయి. పురపాలక సంఘాలకు చెందిన రిజర్వు స్థలాలకు చాలా చోట్ల ఏళ్ల తరబడి ఎలాంటి రక్షణ లేకపోవడంతో అక్రమార్కులు వాటిపై కన్నేసి ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి స్థలాలకు  ప్రైవేటు వ్యక్తుల పేరిట పన్ను వేయించేలా  అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

ఆకివీడు పట్టణ నడిబొడ్డున ఉన్న దొరగారి చెరువు ఇది. ఏళ్ల తరబడి నిరుపయోగంగా వదిలేయడంతో దీని చుట్టూ ఆక్రమణలు పెరిగిపోయాయి. ఐదెకరాల విస్తీర్ణంలో ఉండాల్సి చెరువు భూమిలో సుమారు రెండెకరాల వరకు అన్యాక్రాంతమైంది. దీని విలువ ఆ ప్రాంతంలో మార్కెట్‌ ధర ప్రకారం రూ.20 కోట్ల పైమాటే. కొందరు రాజకీయ నాయకులు ఆక్రమణదారులకు అండగా నిలుస్తూ చెరువు ప్రక్షాళన అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే పట్టణంలో కొండయ్యచెరువు భూములు కూడా ఆక్రమణలకు గురైనట్లు ఆరోపణలున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో రూ.కోట్ల విలువైన పురపాలక స్థలానికి ప్రైవేటు వ్యక్తుల పేరిట పన్ను వేయండంటూ ఓ నాయకుడు ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు ఉద్యోగులకు ఆ నేత నుంచి పిలుపు రావడం వెనుక ఎవరి హస్తం ఉందనే విషయమై చర్చ జరుగుతోంది. ఈ పట్టణంలో తృతీయశ్రేణి నాయకుడొకరు పురపాలక స్థలాన్ని శుభ్రం చేయించి పాగా వేసేందుకు ప్రయత్నించగా స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
జంగారెడ్డిగూడెంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. దీనిని కేటాయించిన స్థలం ఆక్రమణల చెరలో ఉండటంతో పనులు మొదలు కాలేదు. ఈ వ్యవహారం వెనుక కొందరు రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
పాలకొల్లు పురపాలక సంఘానికి చెందిన రూ.కోట్ల విలువైన రిజర్వు స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు యత్నించారు. దీనికోసం కొద్ది రోజుల పాటు పట్టణంలో మకాం వేశారు. విషయం బయటకు పొక్కి ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో దానికి తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.


ఇదీ తీరు..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టణాల్లో స్థలాలకు సంబంధించి ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌(ఎఫ్‌ఎంబీ)ను 1935లో తయారు చేసి సరిహద్దులను నిర్ణయించారు. ఆక్రమణదారులు అప్పటి కొలతలను తారుమారుచేసే యత్నాలు ప్రారంభించారు. కొన్ని పట్టణాల్లో గతంలో ఆక్రమణలకు గురైన కొన్ని స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి జాగాలకు కూడా రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్రమార్కులు మళ్లీ కబ్జాలకు తెగబడుతున్నారు. భీమవరంలో అధికారులు గతంలో స్వాధీనం చేసుకున్న స్థలానికి ఇప్పటికీ రక్షణ చర్యలు తీసుకోలేదు. నరసాపురంలో పురపాలక స్థలాలకు రక్షణ చర్యలు చేపట్టాలనే ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు.


చర్యలు చేపట్టాం

పురపాలక రిజర్వు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టామని పట్టణ ప్రణాళిక ఆర్డీ ఎన్‌.శ్రీనివాస్‌ చెప్పారు. రిజర్వు స్థలాల విషయంలో జీవో ఆర్‌టీ 114 ప్రకారం చర్యలుంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని