logo

దోపిడీకి ప్రణాళిక!

ఏలూరు నగర పరిధిలోని లునానినగర్‌లో దాదాపు రెండు వేల గజాల్లో దుకాణాలు, గోదాములు నిర్మిస్తున్నారు. దీనికి కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోలేదు.

Published : 02 Feb 2023 06:14 IST

ప్లాన్‌ అప్రూవల్‌ లేకుండానే నిర్మాణాలు
కొందరు కార్పొరేటర్లు, అధికారుల దందా
నగర పాలక సంస్థలో వసూళ్ల పర్వం

ఏలూరు నగర పరిధిలోని లునానినగర్‌లో దాదాపు రెండు వేల గజాల్లో దుకాణాలు, గోదాములు నిర్మిస్తున్నారు. దీనికి కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోలేదు. స్థానిక నాయకుడితో అధికారులకు సిఫార్సు చేయించారు. దీనికి ఆ నాయకుడికి రూ.లక్ష, అధికారులకు రూ.50 వేలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

* ఏలూరు అశోక్‌నగర్‌ నుంచి సుబ్బమ్మదేవి పాఠశాలకు వెళ్లే మార్గంలో ఓ నిర్మాణం చేపడుతున్నారు. కార్పొరేషన్‌ నుంచి ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోకుండానే మొదటి అంతస్తు  నిర్మిస్తున్నారు. నిర్మాణం ప్రధాన రహదారిపైనే ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నిర్మాణదారుడి నుంచి అధికారులు, నాయకులు కలిపి రూ.1.50 లక్షలు వసూలు చేశారు.

ఈనాడు, డిజిటల్‌, ఏలూరు


ఏలూరు నగర పాలక సంస్థలో టౌన్‌ ప్రణాళిక విభాగం గాడితప్పింది. కొందరు కార్పొరేటర్లు, అధికారులు కుమ్మక్కై దోపిడీకి తెర తీశారు. ముడుపులు పుచ్చుకుని వందలాది ఇళ్లు ప్లాన్‌ అప్రూవల్‌ లేకుండానే నిర్మిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడుతోంది.

నగర, పుర పాలికల పరిధిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాలంటే తప్పనిసరిగా ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోవాలి. స్థలం విస్తీర్ణం బట్టి చలానా కట్టాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే కార్పొరేషన్‌ పరిధిలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ తంతుకు ఇటు నాయకులు.. అటు అధికారులు కొందరు సహకారం అందిస్తున్నారు. ఇందుకు భారీగానే దండుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్రూవల్‌ లేకుండా నిర్మాణాలు చేపడుతున్న వారి నుంచి కార్పొరేటర్లు రూ.50 వేల నుంచి రూ.లక్ష, అధికారులు రూ.25వేల నుంచి  రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారం కార్పొరేషన్‌ పరిధిలోని 44, 45, 48, 34, 35, 36, 49, 5, 6 డివిజన్లలో జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.


ఆక్రమణదారులే లక్ష్యం

ప్లాన్‌ అప్రూవల్‌ మంజూరు చేయాలంటే ఆ స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలి. భూమి రిజిస్టర్‌ అయి ఉండాలి. ఆక్రమణలు, పట్టా లేని భూములకు అప్రూవల్‌ ఇవ్వరు. ఇదే విషయం అధికారులు, కార్పొరేటర్లకు వరంగా మారింది. నగరపాలక సంస్థ పరిధిలో ఏటిగట్టు ఆక్రమణలు కోకొల్లలు. అలాగే ప్రభుత్వ స్థలాల ఆక్రమణలూ ఎక్కువే. వీటిల్లో నిర్మాణాలు చేపడుతున్న వారికే కార్పొరేటర్లు, అధికారులు వల వేస్తున్నారు. ప్లాన్‌ అప్రూవల్‌ లేదంటూ బెదిరించి భారీగా వసూలు చేసి వాటాలు వేసుకుంటున్నారు.


అంతటా ఇదే తంతు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే వ్యవహారం సాగుతోంది. తాడేపల్లిగూడెం పరిధిలోని మిలటరీ కాలనీ, గణేష్‌నగర్‌, యాగర్లపల్లి, బల్లదొడ్డి, జువ్వలపాలెం తదితర ప్రాంతాల్లో నాన్‌ లేఅవుట్లు, ఆక్రమిత స్థలాల్లో ఎవరికీ ప్లాన్‌ అప్రూవల్‌ లేదు. అయినా అక్కడ నిర్మాణాలు యథావిధిగా  జరిగిపోతున్నాయి. భీమవరం, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, నూజివీడు.. ఇలా అన్ని పురపాలికల్లో ఇదే వ్యవహారం సాగుతోంది. పాలకవర్గమున్న చోట్ల కౌన్సిలర్లు, లేనిచోట్ల అధికారులు ఒక్కో నిర్మాణానికి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.

* ప్లాన్‌ అప్రూవల్‌ లేకుండా చేపడుతున్న నిర్మాణాల్లో నిబంధనలు కూడా పాటించడం లేదు.  సెట్‌ బ్యాక్స్‌, ఫైర్‌ సేఫ్టీ, అంతస్తుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.


ఈ విషయమై ఏలూరు జేసీ అరుణ్‌బాబు, పశ్చిమగోదావరి కలెక్టర్‌ పి.ప్రశాంతి వివరణ కోరగా టౌన్‌ ప్లానింగ్‌ వ్యవస్థలో దస్త్రాలు, క్షేత్రస్థాయి అనుమతుల్ని పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని