logo

అదృశ్యమైన వ్యక్తి హత్య!

గత నెలలో అదృశ్యమైన ముసునూరు మండలం ఎల్లాపురానికి చెందిన రాయన్నపాటి రాటాలు (36) హత్యకు గురైనట్లు అతడి తండ్రి సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపారు.

Published : 02 Feb 2023 06:14 IST

ముసునూరు, న్యూస్‌టుడే: గత నెలలో అదృశ్యమైన ముసునూరు మండలం ఎల్లాపురానికి చెందిన రాయన్నపాటి రాటాలు (36) హత్యకు గురైనట్లు అతడి తండ్రి సత్యనారాయణ బుధవారం విలేకరులకు తెలిపారు. వివరాలిలా.. జనవరి 3న తన కుమారుడు కనిపించడం లేదని బాధితుడి తండ్రి ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన వారు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో మృతుడి భార్య కూడా ఉన్నారు. మంగళవారం రాత్రి పోలీసులు సత్యనారాయణను పిలిచి మీ కుమారుడిని హత్య చేసి చెక్కపల్లి అటవీ ప్రాంతంలో తగులబెట్టినట్లు చెప్పారు. అనంతరం సగం కాలిన మృతదేహాన్ని ఎల్లాపురం తీసుకొచ్చి తమ్మిలేరు వాగులో పూడ్చి పెట్టినట్లు తెలిపారు. దీనికి సంబంధించి బుధవారం శవ పరీక్షకు పోలీసులు ఏర్పాట్లు చేయగా డాక్టర్‌ రాకపోవడంతో ఆ కార్యక్రమం వాయిదాపడింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని నూజివీడు రూరల్‌ సీఐ అంకబాబు తెలిపారు. హత్య నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.


అటవీ పుల్లల రవాణా ట్రాక్టర్ల పట్టివేత

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెం మండలం ఎర్రాయిగూడెం సమీపాన అక్రమంగా అటవీ పుల్లలను రవాణా చేస్తున్న అయిదు ట్రాక్టర్లను సోమవారం అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నట్లు కన్నాపురం అటవీ రేంజ్‌ అధికారి కృష్ణకుమారి తెలిపారు. పుల్లతో సహా ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని రేంజ్‌ కార్యాలయానికి తరలించామన్నారు. రవ్వారిగూడెం అటవీ ప్రదేశం నుంచి ఈ పుల్లను తరలిస్తున్నట్లు భావిస్తున్నామని, దాని విలువను అంచనా వేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని