logo

వివాహేతర సంబంధంతోనే హత్య

ముసునూరు మండలం ఎల్లాపురానికి చెందిన రాయన్నపాటి రాటాలు(36) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని నూజివీడు డీఎస్పీ అశోక్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Published : 03 Feb 2023 01:58 IST

మృతదేహాన్ని వెలికితీయించిన పోలీసులు

రాటాలు (పాత చిత్రం)

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం ఎల్లాపురానికి చెందిన రాయన్నపాటి రాటాలు(36) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని నూజివీడు డీఎస్పీ అశోక్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు ప్రధాన నిందితుడు చెప్పిన సమాచారం మేరకు ఆ గ్రామ పరిధి తమ్మిలేరు వాగులో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తహశీల్దార్‌ సుధ సమక్షంలో గురువారం వెలికి తీయించి పరీక్ష నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ కథనం మేరకు.. రాటాలు తన వాహనం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తూ ఉపాధి పొందుతుంటాడు. అతడి భార్యకు అదే గ్రామానికి చెందిన గార్లమూడి లోకేశ్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై రాటాలు, లోకేశ్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న లోకేశ్‌.. జనవరి 3న సూరేపల్లి గ్రామానికి ఇసుక రవాణా చేయాల్సి ఉందని చెప్పి నమ్మించి రాటాలును చెక్కపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి ముఖంపై పెప్పర్‌ స్ప్రే చల్లి, ఇనుప రాడ్లు, కర్రలతో మోది చంపేశారు. అనంతరం పెట్రోలు పోసి దహనం చేశారు. సగం కాలిన శవాన్ని అదే రోజు రాత్రి ఎల్లాపురం గ్రామానికి తీసుకొచ్చి తమ్మిలేరు వాగులో పూడ్చిపెట్టారు. కుమారుడి అదృశ్యంపై గత నెల 5న మృతుడి తండ్రి ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా రాటాలు చరవాణి కాల్‌ డేటా ఆధారంగా నిందితుడు లోకేశ్‌తో పాటు అతడికి సహకరించిన వారిని పోలీసులు గుర్తించారు. ఈ లోగా భయపడిన ప్రధాన నిందితుడు తహశీల్దార్‌ ఎదుట లొంగిపోయాడు. దీంతో అతడితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రాటాలు హత్య ఉందంతం తెలుసుకున్న గ్రామస్థులు శవాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతానికి భారీగా తరలివచ్చారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూజివీడు రూరల్‌ సీఐ అంకబాబు, ముసునూరు, నూజివీడు ఎస్సైల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

నిందితుడిని (మాస్క్‌ ఉన్న వ్యక్తి) స్థల గుర్తింపు కోసం తీసుకొస్తున్న పోలీసులు

గ్రామస్థులను నిలువరిస్తున్న పోలీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు