logo

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రి మృతి చెందగా.. అతడి మూడేళ్ల చిన్నారికి స్వల్ప గాయాలైన సంఘటన జంగారెడ్డిగూడెం మండలంలో గురువారం చోటుచేసుకుంది.

Published : 03 Feb 2023 01:58 IST

తండ్రి దుర్మరణం.. కుమార్తెకు స్వల్పగాయాలు

అనిల్‌కుమార్‌ (పాతచిత్రం)

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో తండ్రి మృతి చెందగా.. అతడి మూడేళ్ల చిన్నారికి స్వల్ప గాయాలైన సంఘటన జంగారెడ్డిగూడెం మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జంగారెడ్డిగూడెం మండలం చిన్నంవారిగూడేనికి చెందిన బండారు అనిల్‌కుమార్‌(28) జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తన మూడేళ్ల కుమార్తె విషితను వారం రోజుల కిందట అదే పాఠశాలలో నర్సరీలో చేర్చాడు. ఈ నేపథ్యంలో గురువారం విధులు ముగిసిన అనంతరం కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా జల్లేరు వంతెన వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వారిని ఢీకొట్టడంతో చెరోవైపు పడిపోయారు. ఆ సమయంలో అనిల్‌కుమార్‌ తలపై నుంచి వాహనం వెళ్లడంతో ఘటనాస్థలిలోనే చనిపోయాడు. చిన్నారి విషిత స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదంతో వంతెనకు ఇరువైపులా కిలోమీటరు మేర ట్రాఫిక్‌ నిలిచింది. సీఐ బాలసురేష్‌, ఎస్సై సాగర్‌బాబు చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబధ్ధీకరించారు. అనిల్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ చోదకుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంలో తండ్రిని కోల్పోయి అయోమయ స్థితిలో ఉన్న చిన్నారిని చూసిన పలువురు కంటతడిపెట్టారు. వెంటనే స్థానికులు ఆమెను వేరే వాహనంలో ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపు కుటుంబానికి ఆసరాగా ఉండే వ్యక్తి చనిపోవడంతో అతడి భార్య, తల్లిదండ్రులు రోదిస్తున్నారు.  


రైల్లోంచి పడి.. యువకుడి మృతి

రెజిమెంటల్‌ బజార్‌, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు రైల్లోంచి పడిపోయి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా గునుపూడికి చెందిన ధూళిపూడి తేజ (31) కూకట్‌పల్లిలో ఉంటూ పండ్ల దుకాణంలో పనిచేస్తున్నాడు. సొంతూరులో ఉంటున్న తండ్రికి ఆరోగ్యం బాలేదని తెలిసి అక్కడికి వెళ్లేందుకు బుధవారం రాత్రి సికింద్రాబాద్‌ నుంచి రైల్లో బయల్దేరాడు. గురువారం ఉదయం 9 గంటలకు ఘట్‌కేసర్‌- బీబీనగర్‌ స్టేషన్ల పక్కన ఓ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన కీమ్యాన్‌ జీఆర్పీ పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా మృతుడి వద్ద లభ్యమైన ఆధార్‌కార్డు ఆధారంగా తేజగా గుర్తించారు. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో డోర్‌ వద్ద కూర్చుని ఉండటంతో ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.


గడ్డి మందు తాగి ఒకరి బలవన్మరణం

పెదపుల్లేరు(ఉండి), న్యూస్‌టుడే: కొంత కాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఒక వ్యక్తి మనస్తాపం చెంది గురువారం గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై కె.గంగాధరరావు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. పెదపుల్లేరు గ్రామానికి చెందిన దొంగ శ్రీను(52) వైద్యానికి ఖర్చు ఎక్కువవుతోందని గురువారం మధ్యాహ్నం గడ్డి మందు తాగాడు. హుటాహుటిన శ్రీనుని భీమవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు సునిల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్సై గంగాధరరావు తెలిపారు.


బావ మృతిని తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

పెదపాడు, న్యూస్‌టుడే: బావ ప్రమాదంలో మృతి చెందిన ఘటనను జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది.  పెదపాడు ఎసై బి.నాగబాబు తెలిపిన వివరాల మేరకు..కొత్తముప్పర్రు గ్రామానికి చెందిన చేసాని జగన్నాథరావు, కుటుంబ సభ్యులందరూ స్థానిక ఇటుకల బట్టిలో పనిచేస్తుంటారు. ఆయన కుమార్తె (14) కూడా అక్కడే పనిచేస్తోంది. గత నెల 25న బాలిక బావ నాగరాజు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదలో మృతి చెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక అదే రోజు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని