logo

గిరిపుత్రులపై మమకారం!

కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలతో మన్యంకు మహర్దశ పట్టనుంది. గిరిపుత్రులకు ఉపయోగపడే అనేక అంశాలను పొందుపరిచి ఏజెన్సీపై మమకారం చూపారు.

Published : 03 Feb 2023 01:58 IST

సద్వినియోగం చేసుకుంటేనే ప్రగతి  
కేంద్ర బడ్జెట్‌లో మన్యానికి పెద్దపీట
కుక్కునూరు,బుట్టాయగూడెం,  న్యూస్‌టుడే

కుక్కునూరు మండలంలో జొన్నపంట

కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలతో మన్యంకు మహర్దశ పట్టనుంది. గిరిపుత్రులకు ఉపయోగపడే అనేక అంశాలను పొందుపరిచి ఏజెన్సీపై మమకారం చూపారు. శ్రీఅన్న, దుర్బల గిరిజన తెగల అభివృద్ధి పథకం (పీవీటీజీ), ఏకలవ్య పాఠశాలలకు నిధులు, పోస్టులు వంటివి మేలు చేస్తాయి. ఆరోగ్య, విద్య తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం హర్షణీయం. ఉపాధి హామీ నిధుల్లో కోత విధించడం బడుగు వర్గాలపై ప్రభావం చూపనుంది.

తెరపైకి పీఎం- పీవీటీజీ

ఎన్నో గిరిజన కుటుంబాలు నేటికీ నాగరిక సమాజానికి దూరంగా బతుకులీడుస్తున్నాయి. దుర్బర గిరిజన తెగల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు ప్రధానమంత్రి దుర్బల ఆదిమ గిరిజన తెగల అభివృద్ధి పథకాన్ని (పీఎం- పీవీటీజీ) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పథకం కింద మూడేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయించనున్నారు. దీనివల్ల జిల్లాలో బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో 2276 కొండరెడ్డి తెగకు చెందిన 10,827 మందికి   ప్రయోజనం చేకూరనుంది.

శ్రీఅన్న.. చిరుధాన్యాలే మిన్న 

2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ‘శ్రీఅన్న’ పేరుతో చిరుధాన్యాల సాగుకు ప్రత్యేక పథకం రూపొందిస్తున్నారు. జిల్లా వాణిజ్య, ఆహార పంటలకు పెట్టింది పేరుకాగా, ఏజెన్సీలోని మెట్ట, పోడు భూములు చిరుధాన్యాల సాగుకు ఎంతో అనువుగా ఉంటాయి. కొన్ని దశాబ్దాల కిందట వరకూ ఈ ప్రాంతంలో జొన్న, రాగులు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యాలనే పండించేవారు. తర్వాత వాటికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆ పంటలకు స్వస్తి పలికి, పత్తి, వరి వంటి పంటలను సాగు చేస్తున్నారు.జిల్లాలోని మన్యం ప్రాంతంలో 47,070 ఎకరాల సాగు భూమి ఉంది. ఇవిగాక పోడు పేరిట అడవులను నరికి సేద్యం చేసే భూములు మరో 15-20 వేల ఎకరాల వరకు ఉంటాయి. శ్రీఅన్న పథకంతో మన్యంలోని సాగు పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావచ్చు.

గిరిజన అభివృద్ధికి పెరిగిన నిధులు

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది రూ.12,461.88 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 47.44 శాతం ఎక్కువ. ఈ నిధులు జిల్లాలోని అయిదు మండలాల్లో 151 రెవెన్యూ గ్రామాలకు, తద్వారా 81,776 మంది గిరిజన జనాభా ప్రయోజనం పొందే అవకాశాలుంటాయి. ఇవి మంజూరు అయ్యేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

తగ్గిన ఉపాధి

మన్యంలో 70 శాతం మంది కూలి పనులపై ఆధారపడే వారే. వ్యవసాయ పనులు లేని సమయంలో వీరందరికీ ఉపాధి హామీ పథకం ఆధారంగా ఉంటోంది. దీనికి గత బడ్జెట్లో పోలిస్తే, ఈ ఏడాది రూ.29 వేల కోట్లు తగ్గించారు. రూ.89 వేల కోట్లు నుంచి రూ.60 వేల కోట్లకు కోతపెట్టారు. ఈ పనులపై ఆధారపడిన శ్రమజీవులపై ఆ ప్రభావం పడనుంది. ఈ ఏడాదే చాలావరకూ పనిదినాలు తగ్గించేశారు. వచ్చే ఏడాది మరిన్ని పనిదినాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని