logo

ప్రయోగ పరీక్షలకు వేళాయె..!

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఈ ఏడాది నాన్‌ జంబ్లింగ్‌ విధానంలో ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు.

Published : 03 Feb 2023 01:58 IST

నాన్‌జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు
ఏలూరు విద్యా విభాగం, ఉంగుటూరు న్యూస్‌టుడే

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఈ ఏడాది నాన్‌ జంబ్లింగ్‌ విధానంలో ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో  నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రికార్డులను అనుసరించాలి

ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా రికార్డు కలిగి ఉండటంతోపాటు దాన్ని అనుసరించి ప్రయోగ పరీక్షకు సిద్ధమైతే మంచి మార్కులను సులభంగా పొందవచ్చు. ప్రయోగంలో నాలుగు ప్రశ్నలుంటాయి. మొదటి ప్రశ్నకు చక్కని పటం, ఏవైనా నాలుగు భాగాలు గుర్తిస్తే 6 మార్కులు వస్తాయి. రెండో ప్రశ్నలో మూలసూత్రం, ప్రయోగ విధానం, ఫలితం రాస్తే ఉత్తీర్ణత పొందడం సులభం అవుతుంది. మూడో ప్రశ్నలో గుర్తింపు లక్షణాలు, చిన్న పటం వేయడం అవసరం.

 ఎం.నీలిమ, జంతుశాస్త్ర అధ్యాపకురాలు

ప్రాథమిక అంశాలపై పట్టుతో

రసాయనశాస్త్రానికి సంబంధించి ప్రాథమిక పరీక్షలు చేయాలి. మొలారిటీ, ప్రొటీన్‌, కార్పొహైడ్రేట్స్‌ శాతం కనుగొనడం వంటి ప్రయోగాలపై దృష్టి సారించాలి. వచ్చిన ఫలితాలను ఎప్పటికప్పుడు ఇన్విజిలేటర్‌కు తెలియజేసి రిపోర్టులో నమోదు చేయాలి.

 జి.శ్రీనివాస్‌, రసాయనశాస్త్ర అధ్యాపకుడు

సూటిగా సమాధానం రాయాలి

భౌతిక శాస్త్రంలో ప్రశ్నకు సూటిగా సమాధానం రాయాలి. ఒకే ప్రయోగంలో రెండు, మూడు ప్రశ్నలుంటాయి. రికార్డు కలిగి ఉంటే 4 మార్కులు పొందవచ్చు. ముందుగా ప్రశ్నకు సంబంధించిన విషయాలు, జాగ్రత్తలు, ప్రయోగ విధానం రాస్తే సులభంగా ఉత్తీర్ణులు కావచ్చు. ప్రశ్నకు సంబంధించిన సర్క్యూట్‌, డయాగ్రమ్‌, గ్రాఫ్‌లను గీస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.

 వి.భవానీ, భౌతికశాస్త్ర అధ్యాపకురాలు

సాంకేతిక వర్ణన కీలకం

వృక్ష శాస్త్రానికి సంబంధించి మొదటి ప్రశ్నలోని మూడు కుటుంబాల సాంకేతిక వర్ణన గురించి బాగా నేర్చుకోవాలి. రెండో ప్రశ్నలో అంతర్నిర్మాణ శాస్త్రంలో కేవలం విస్తరించిన భాగాన్ని మాత్రమే పటంలాగా నేర్చుకోవాలి. మూడో ప్రశ్నకు సంబంధించి లైవ్‌ ప్రయోగాల్లో ఉద్దేశము, సూత్రము, పరిశీలన, ఫలితం మాత్రమే బాగా చదవాలి. నాలుగో ప్రశ్నలో గుర్తింపు లక్షణాలు మాత్రమే (కేవలం రెండు పాయింట్లు) రాస్తే సరిపోతుంది. రికార్డు, హెర్బేరియం ఉంటే కచ్చితంగా ఏడు మార్కులు పొందవచ్చు.

 సీహెచ్‌ సుభాశ్‌కుమార్‌, వృక్షశాస్త్ర అధ్యాపకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని