logo

లెక్కా పత్రం లేదు!

రైతులకు ఆర్థిక దన్నుగా నిలవాల్సిన సహకార సంఘాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కామవరపుకోట సొసైటీలో ఐదేళ్లలో రూ.3 కోట్ల మేర మింగేశారు.

Published : 03 Feb 2023 02:17 IST

కామవరపుకోట సహకార సంఘంలో రూ.3 కోట్ల స్వాహా
ఈనాడు డిజిటల్‌, ఏలూరు

సహకార సంఘ కార్యాలయం

రైతులకు ఆర్థిక దన్నుగా నిలవాల్సిన సహకార సంఘాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కామవరపుకోట సొసైటీలో ఐదేళ్లలో రూ.3 కోట్ల మేర మింగేశారు. అక్రమాల్లో సంఘం కార్యదర్శి, సిబ్బంది, బ్రాంచి మాజీ పర్యవేక్షకుడు, పాలకవర్గ అధ్యక్షుడు కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన సహకార శాఖ ఆడిట్‌లో ఇవి వెలుగులోకి వచ్చాయి. 

కామవరపుకోట సహకార సంఘంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో రూ.73.40 లక్షలు మింగేశారు. సరైన అంచనాలు, ఎంబుక్స్‌, బిల్లులు లేకుండా తప్పుడు లెక్కలతో సొసైటీ పెట్రోల్‌ బంకులో సౌకర్యాలు, రీమోడలింగ్‌ పేరిట  రూ.56.13 లక్షలు గోల్‌మాల్‌ చేశారు. అవసరం లేకుండానే జిరాక్సులు, స్టేషనరీ తదితర (అనామతు) ఖర్చులు పెట్టామని బిల్లులు లేకుండానే రూ.8.59 లక్షలు వాడేశారు. డీజిల్‌ అమ్మకాల్లో 1044 లీటర్లు అక్రమంగా అమ్ముకుని రూ.1.72 లక్షలు దారిమళ్లించారు. రికార్డుల్లో ఖర్చులకు, జమకు పొంతన లేదు. తప్పుడు కూడికలతో రూ.95,858 దుర్వినియోగం చేశారు. ఇలా ఇష్టారాజ్యంగా తప్పుడు లెక్కలతో దోపిడీకి తెరతీశారు. సంఘం పరిధిలోని ఎరువులు, చౌకధరల దుకాణాలు, రెండు పెట్రోల్‌ బంకుల్లో వ్యాపారం చేస్తున్నా ఒక్కదానిలోనూ లాభం చూపకుండా దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టాలు చూపించి కొన్ని నిధులు దారిమళ్లించారు.

బాధ్యులు వీరే..  ఈ అక్రమాల్లో కార్యదర్శి బాబూరావుతో పాటు సేల్స్‌మ్యాన్‌ సీహెచ్‌ శేఖర్‌, మాజీ అధ్యక్షుడు కె.రాధాకృష్ణ, మాజీ పర్యవేక్షకుడు జె.కిశోర్‌రెడ్డిని బాధ్యులుగా చేస్తూ ఆడిట్‌ అధికారి నివేదిక ఇచ్చారు. వీరినుంచి దుర్వినియోగమైన సొమ్మును వడ్డీతో కలిపి వసూలు చేసి, ఆస్తులు జప్తు చేసి క్రిమినల్‌, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. గతంలో జరిగిన సెక్షన్‌ 51 విచారణలో బాధ్యులపై చర్యలకే దిక్కులేదు. ఆడిట్‌ నివేదికపై ఏం చర్యలు తీసుకుంటారని అధికారులను రైతులు ఎద్దేవా చేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి ఆడిటర్లు, మేనేజర్లు, పర్యవేక్షకులు ఏటా తనిఖీలు చేస్తున్నా నిధులు దారిమళ్లినట్లు గుర్తించకపోవడం గమనార్హం.

కంచే చేను మేసింది

2017-19 మధ్య కాలంలో డీసీసీబీ కామవరపుకోట బ్రాంచి పర్యవేక్షకుడిగా పని చేసిన జె.కిశోర్‌రెడ్డి సంఘం ఇన్‌ఛార్జి కార్యదర్శిగా కూడా పనిచేశారు. అప్పుడు అడ్వాన్స్‌ పేరిట రెండు దఫాలుగా రూ.6 లక్షలు స్వాహా చేశారు. సంఘం నిధులు కాపాడాల్సిన బ్యాంకు అధికారే అవకాశం చిక్కడంతో అందినకాడికి నొక్కేశారు.

చర్యలు ఏవీ?

కామవరపుకోట సొసైటీపై 2017లో సెక్షన్‌ 51 విచారణ చేశారు. పెట్రోలు బంకులో వచ్చిన సొమ్ము స్వాహా చేయడం, బినామీ రుణాలు ఇవ్వడం, రైతులు రుణాలు చెల్లించినా సంఘానికి కట్టకుండా దారి మళ్లించడం చేశారు. ఇలా అన్నీ కలిపి రూ.2 కోట్లపైనే దుర్వినియోగమైనట్లు గుర్తించారు. అప్పటి పాలక వర్గం, కార్యదర్శి, సిబ్బందిని బాధ్యులుగా తేల్చారు. విచారణ అధికారి, డివిజినల్‌ సహకార అధికారి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పాలక వర్గానికి సూచించారు. అయిదేళ్లు దాటినా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. సంబంధిత అధికారులు మొత్తం ముడుపులు పుచ్చుకుని విషయాన్ని కప్పిపుచ్చారు. చోద్యం ఏంటంటే అప్పుడు బాధ్యుల్లో ఒక్కరైనా సేల్స్‌మ్యాన్‌ టి.బాబూరావుపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. మరో ఇద్దరు సేల్స్‌మ్యాన్లు కూడా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు.

* ఈ విషయమై డీసీవో ప్రవీణ వివరణ కోరగా తనిఖీ చేసిన అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు