logo

అర్ధరాత్రి వరకు హైడ్రామా

కోడేరు ఇసుక ర్యాంపు సీజ్‌ వ్యవహారం రచ్చకెక్కింది. అధికార పార్టీ నేతలు, అధికార యంత్రాంగం మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీసింది.

Published : 04 Feb 2023 05:05 IST

రచ్చకెక్కిన కోడేరు ఇసుక ర్యాంపు సీజ్‌ వ్యవహారం
తహశీల్దారు ఫిర్యాదు చేసినా నమోదు కాని కేసు

తహశీల్దారు కార్యాలయం వద్ద స్వాధీనం చేసుకున్న వాహనాలు

ఆచంట, న్యూస్‌టుడే: కోడేరు ఇసుక ర్యాంపు సీజ్‌ వ్యవహారం రచ్చకెక్కింది. అధికార పార్టీ నేతలు, అధికార యంత్రాంగం మధ్య ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు సాగించడంతో నరసాపురం సబ్‌కలెక్టర్‌ ఆదేశాలతో గురువారం రాత్రి రీచ్‌లో స్థానిక అధికారులు దాడులు చేసి పొక్లెయిన్లతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. స్వాధీనం చేసుకున్న వాహనాలను తొలుత పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం  తహశీల్దారు ఆర్‌.రాజ్యలక్ష్మి వాహన యజమానులు, డ్రైవర్లతో పాటు జేపీ సంస్థ ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలని రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 గంటలకు ఏలూరు నుంచి మైనింగ్‌ శాఖ అధికారులు వచ్చి తహశీల్దారుతో చర్చలు జరిపారు. రాత్రి 12 గంటల వరకు జరిగిన చర్చలు ఎటూ తేలకపోవడంతో అర్ధరాత్రి వరకు స్టేషన్‌ వద్ద హైడ్రామా జరిగింది. ఎస్సై అందుబాటులో లేకపోవడంతో కేసు నమోదు చేయలేదు. దీంతో సబ్‌కలెక్టర్‌ సూచనలతో రాత్రి 2 గంటల సమయంలో స్టేషన్‌ వద్ద నిలిపిన వాహనాలను తిరిగి తహశీల్దారు కార్యాలయానికి తరలించారు.


రెండో రోజూ అదే తంతు

రెండో రోజు శుక్రవారం కూడా ఇదే తంతు కొనసాగింది. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు కేసు నమోదులో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మండల మేజిస్ట్రేట్‌ అయిన తహశీల్దారు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై పెనుగొండ సీఐ నాగేశ్వరరావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా దర్యాప్తు సాగుతోందని తెలిపారు.


నిర్వాహకులను వదిలేసి...

రీచ్‌పై అధికారులు దాడులు చేసిన సమయంలో ఒక టిప్పర్‌, లారీ, రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. వీటిలో టిప్పర్‌ తప్ప మిగిలిన మూడు వాహనాల డ్రైవర్లు ఇసుక నిమిత్తం జేపీ సిబ్బందికి నగదు చెల్లించి రసీదులు పొందారు. అయినా అధికారులు టిప్పర్‌తో పాటు మూడు వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇదే సమయంలో అనధికారికంగా రీచ్‌ నిర్వహణ చూస్తున్న అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు అక్కడే ఉన్నారు. వీరిని వదిలేసి నగదు చెల్లించిన వాహనదారులను అదుపులోకి తీసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తహశీల్దారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సైతం ముగ్గురు నాయకుల పేర్లు లేకపోవడం గమనార్హం. రీచ్‌పై దాడులు జరిగి 36 గంటలు గడుస్తున్నా నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కోడేరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు శుక్రవారం నరసాపురం సబ్‌కలెక్టర్‌ సూర్యతేజను కలిసి తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అధికార యంత్రాంగం చర్యలు తీసుకోని పక్షంలో కోర్టులో కేసు వేస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని