logo

అక్రమాలు కోకొల్లలు

కామవరపుకోట సహకార  సంఘంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2021 వరకు దాదాపు రూ.3 కోట్ల అవినీతి జరిగితే..2022వ ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లో రూ.1.31 కోట్లు స్వాహా చేసినట్లు తెలుస్తోంది.

Published : 04 Feb 2023 05:05 IST

9 నెలల్లో రూ.1.31 కోట్లు స్వాహా
పెట్రోల్‌, డీజిల్‌ నిల్వల్లో గోల్‌మాల్‌
కామవరపుకోట సొసైటీలో ఇదీ తీరు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: కామవరపుకోట సహకార  సంఘంలో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 2021 వరకు దాదాపు రూ.3 కోట్ల అవినీతి జరిగితే..2022వ ఆర్థిక సంవత్సరంలో 9 నెలల్లో రూ.1.31 కోట్లు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకుల్లో పెట్రోలు, డీజిల్‌ అమ్ముకోవటం.. బిల్లులు లేకుండా నిధుల దుర్వినియోగం ద్వారా సంఘాన్ని అక్రమాలకు వేదిక చేశారు. ఇంత జరుగుతున్నా బ్యాంకు, సహకారశాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కామవరపుకోట సహకార సంఘం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. చూపిన ఖర్చులకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. సంఘ  పరిధిలో రెండు   బంకులు నిర్వహిస్తున్నారు. స్టాక్‌ రిజిస్టర్‌ ప్రకారం 2022 డిసెంబర్‌ 31 నాటికి ఉండాల్సిన నిల్వలో పెట్రోల్‌ 3734, డీజిల్‌ 921 లీటర్లు మాయం చేశారు. దాని ద్వారా రూ.5.09 లక్షలు స్వాహా చేశారు. బంకుకు సంబంధించిన మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీరు, ఫ్యాన్లు, పెట్రోల్‌ పోసే పంపులు ఇలా నిర్వహణకు సంబంధించిన ట్రేడ్‌ ఖర్చులుగా రూ.1.03 కోట్లు చూపించారు. ఇందులో పైసా కూడా ఖర్చు చేయకుండా లెక్కల్లో చూపించి దుర్వినియోగం చేశారు. బిల్లుల్లో కొన్నట్లు చూపిన వస్తువులు బంకుల్లో లేవు. ఖర్చులకు సక్రమమైన బిల్లులు లేవు. స్టేషనరీ, జిరాక్సులు, టీలు, అల్పాహారం తదితర(కంటిన్‌జెంటు) ఖర్చులు రూ.10.9 లక్షలు, ఎరువులు, చౌకదుకాణ వ్యాపారాల నిర్వహణ ఖర్చులుగా రూ.2 లక్షలు, పరిపాలన(అడ్మినిస్ట్రేటివ్‌) ఖర్చులు రూ.10.51 లక్షలు అంటూ చూపిన ఈ ఖర్చులకు అసలు వోచర్లే లేవు. మొత్తం సొమ్ము కార్యదర్శి, సంఘం అధ్యక్షుడు, క్యాషియర్‌ స్వాహా చేశారు.


ఇష్టారాజ్యంగా ఉద్యోగుల నియామకం

సహకార సంఘాల్లో సర్వీసు రిజిస్ట్టర్‌ ప్రకారం ఆరుగురు మాత్రమే శాశ్వత ఉద్యోగులుండాలి. నాబార్డు నిబంధనల ప్రకారం కార్యదర్శి, సహాయ కార్యదర్శి, నైట్‌ వాచ్‌మ్యాన్‌, ముగ్గురు గుమస్తాలు మాత్రమే ఉండాలి. సంఘం పరిధిలో వ్యాపారాలుంటే అందులో పనిచేసేందుకు పొరుగుసేవల ఉద్యోగులను   నియమించాలి. ఇక్కడ మాత్రం 25-30 మంది ఉద్యోగులున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి అనర్హులైన 21 మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించారు. వారంతా పాలకవర్గం, కార్యదర్శికి ఆప్తులని తెలుస్తోంది. సంఘం సభ్యులకు అప్పులిచ్చిన వివరాలు మినిట్‌ పుస్తకంలో కూడా రాయలేదు. సొంతనిధి(ఓన్‌ఫండ్‌) ద్వారా రూ.87.8 లక్షలు ఇచ్చారు. వీటి కాలపరిమితి దాటినా కార్యదర్శి, అధ్యక్షుడు, అప్పుల వసూలుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదు.


ఎస్‌బీ ఖాతాల్లో చేతివాటం

సంఘంలో పని చేస్తున్న ఉద్యోగుల సేవింగ్స్‌ ఖాతాల్లో నగదు వేయకుండానే జమ చేసినట్లు నమోదు చేశారు. సేవింగ్స్‌ ఖాతా నిల్వ పెంచి తర్వాత ఆ నగదును విత్‌డ్రా చేసుకుంటున్నారు. సంఘం గుమస్తా టీవీవీ సత్యనారాయణ సేవింగ్స్‌ ఖాతా 3717ను విచారణ అధికారిణి పరిశీలించగా నగదు చెల్లించకుండానే జమ చేసినట్లు చూపి తర్వాత నగదు విత్‌డ్రా చేసినట్లు గుర్తించారు. ఇలా  రూ.లక్షల్లో సొమ్ము  దారి మళ్లించినట్లు తెలుస్తోంది. సంఘంలో చేస్తున్న డిపాజిట్లకు పక్కా రసీదులు ఇవ్వటం లేదు. సంఘంలో పనిచేస్తున్న సిబ్బందికి నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తాలను అడ్వాన్సుల రూపంలో ఇచ్చేశారు. విత్‌డ్రాల సమయంలో మేనేజర్‌ చెక్‌పాస్‌ చేసి..నగదు ఇవ్వాలి. ఇన్ని అవకతవకలు జరిగినా అప్పటి మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు పట్టించుకోలేదా..లేక ముడుపులు తీసుకుని మిన్నకున్నారా అన్నది విచారణలో తెలియాల్సి ఉంది. ఈ అంశంపై డీసీవో ప్రవీణను వివరణ కోరగా విచారణ నివేదిక ప్రకారం నిబంధనల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని