logo

అడ్డుకున్న గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్వాసిత రైతులు

గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంతో నష్టపోతున్న తమకు న్యాయం చేయాలని కోరుతూ కొయ్యలగూడెం మండలం పొంగుటూరులో నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు.

Updated : 04 Feb 2023 05:27 IST

పొక్లెయిన్‌కు అడ్డుపడుతున్న రైతును పక్కకు లాగుతున్న పోలీసులు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంతో నష్టపోతున్న తమకు న్యాయం చేయాలని కోరుతూ కొయ్యలగూడెం మండలం పొంగుటూరులో నిర్వాసిత రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం పనులు చేయడానికి వచ్చిన గుత్తేదారు సిబ్బందిని, వాహనాలను అడ్డుకున్నారు. భూములకు సంబంధించి తమకు న్యాయమైన నష్టపరిహారం దక్కలేదన్నారు. న్యాయం చేస్తామని అప్పటి కలెక్టరు హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు పనులను చేయనివ్వమంటూ భీష్మించారు.  పోలవరం సీఐ కె.విజయబాబు వచ్చి రైతులతో చర్చించారు. నష్టపరిహారం నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినందున పనులకు ఆటంకం కల్గించొద్దని తహశీల్దారు పి.నాగమణి సూచించారు. పనుల సమాచారం తెలియజేయకపోవడంతో ఆ భూమిలో రబీ సాగు చేస్తున్నామని, ఉన్నట్టుండి భూముల్లోకి ప్రవేశిస్తామంటే ఆ నష్టం ఎవరు భరిస్తారంటూ రైతులు ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదంటూ రైతులు సత్యశివప్రసాద్‌, మోహనరావు పొక్లెయిన్‌కు అడ్డుపడ్డారు. రోడ్డునిర్మాణంలో వ్యవసాయ బోరు నష్టపోతున్నామని, దానికి సంబంధించిన పైపులైన్లకు పరిహారం ఇవ్వలేదని మోహనరావు తెలిపారు. రోడ్డు పక్కనున్న భూములకు ఎకరాకు రూ.70 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు మార్కెట్‌ ధర ఉందని, భూసేకరణ పేరుతో కేవలం రూ.20 లక్షలు చేతిలో పెడితే తమ కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో ఆయన పొక్లెయిన్‌కు అడ్డుగా పడుకోవడానికి ప్రయత్నించగా ఎస్సై విష్ణువర్థన్‌ అడ్డుకున్నారు. తమ గోడును అధికారులెవరూ పట్టించుకోవడం లేదని, పురుగు మందు తాగి చస్తానంటూ మోహనరావు పరుగులు తీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పైపులైను దెబ్బతినకుండా పనులు చేస్తామని చెప్పి ఎస్సై విష్ణువర్థన్‌, రైతు నాయకులు, కుటుంబ సభ్యులు సముదాయించారు. అనంతరం పనులను కొనసాగించారు. తహశీల్దారు నాగమణి, సీఐ విజయబాబు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు