logo

ఇష్టారాజ్యంగా లేఅవుట్లు!

భీమవరం పరిధిలోని కుముదవల్లి రోడ్డులో దాదాపు 20 ఎకరాల్లో ఓ లేఅవుట్‌ వేశారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. పది శాతం కామన్‌ సైట్‌గా రెండు ఎకరాలు వదల్లేదు.

Published : 06 Feb 2023 05:36 IST

నాయకులు, అధికారుల చేతివాటం

ప్రభుత్వాదాయానికి భారీగా గండి

భీమవరంలో అనధికార లేఅవుట్‌ తొలగింపు (పాత చిత్రం)

* భీమవరం పరిధిలోని కుముదవల్లి రోడ్డులో దాదాపు 20 ఎకరాల్లో ఓ లేఅవుట్‌ వేశారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. పది శాతం కామన్‌ సైట్‌గా రెండు ఎకరాలు వదల్లేదు. 33 శాతం రహదారులకు కేటాయించలేదు. తాగునీటి ట్యాంకులు, పైపు లైన్ల నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్తు, గ్రీనరీ సదుపాయాలు కల్పించలేదు. మట్టితో మెరక చేసినందుకు గనుల శాఖకు సీనరేజ్‌ ఛార్జీలు కూడా చెల్లించలేదు.

* భీమవరం సీఎస్‌ఎన్‌ కళాశాల సమీపంలో దాదాపు 100 ఎకరాల్లో భారీ వెంచర్‌ వేశారు. ఇందులో 5 ఎకరాలకు మాత్రమే లేఅవుట్‌ కన్వర్షన్‌ రుసుం చెల్లించారు. ఇందులో 20 ఎకరాల వరకు కామన్‌ సైట్‌గా విడిచి పెట్టాల్సి ఉన్నా అలా చేయలేదు. రహదారులకు స్థలం కేటాయింపు లేదు. సీనరేజ్‌ ఛార్జీలు చెల్లించలేదు.

* ఏలూరు గ్రామీణ పరిధి చొదిమెళ్లలోని చెరువు సమీపంలో 2 ఎకరాల్లో లేఅవుట్‌ వేశారు. రికార్డుల్లో మాత్రం   మొత్తం స్థలంలో రేకుల షెడ్డు, మూడు ఖాళీ సైట్లు ఉన్నట్లు నమోదు చేశారు. ఇందుకు కార్పొరేషన్‌ అధికారికి ముడుపులు సమర్పించారు. క్షేత్ర స్థాయిలో మాత్రం లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేపడుతున్నారు.

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ఉమ్మడి జిల్లాలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇష్టారాజ్యంగా వెంచర్లు వేస్తున్నారు. ఈ తతంగం వెనుక అధికార పార్టీ నాయకులు ఉంటున్నారు. సంబంధిత అధికారులు ముడుపులు పుచ్చుకొని చూసీచూడనట్లుగా ఉంటున్నారు.  ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, నూజివీడు, జంగారెడ్డిగూడెం ఇలా దాదాపు అన్ని పురపాలికల్లో అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. భీమవరం అక్రమ వెంచర్లకు ఆలవాలంగా మారింది. ఇక్కడ నిబంధనలు పాటించకుండా వందల ఎకరాల్లో లేఅవుట్లు వేశారు. గొల్లవానితిప్ప రోడ్డు, యనమదుర్రు పంచాయతీ పరిధిలోని డేగాపురం సమీపంలో దాదాపు 50 ఎకరాల్లోని లేఅవుట్లలో నిబంధనలకు నీళ్లొదిలారు. భీమవరం పరిధిలో మార్కెట్‌ యార్డు దాటాక కొందరు సుమారు 20 ఎకరాల్లో వేసిన లేఅవుట్‌పై లోకాయుక్తకు  ఫిర్యాదులు అందాయి. వెంచర్‌కు అనుమతి లేదని, 10 శాతం రిజర్వ్‌ సైట్‌, 33 శాతం రహదారులకు కేటాయించలేదని.. లేఅవుట్లో ఎలాంటి సౌకర్యాలు లేవంటూ చేసిన ఫిర్యాదును లోకాయుక్త పరిగణనలోకి తీసుకుంది. అధికారుల అవినీతి, నిబంధనల అతిక్రమణపై విచారణకు ఆదేశించింది. ఇదే తరహాలో పాలకోడేరు మండలం పెన్నాడ పరిధిలోని మరో వెంచర్‌పై కూడా విచారణ చేపట్టనున్నారు.

వారే నడిపిస్తున్నారు.. ఈ వ్యవహారం నడిపిస్తున్నందుకు వైకాపా నాయకులు, అధికారులు భారీ మొత్తాలు తీసుకుంటున్నారు. భీమవరంలో ఓ వైకాపా నేత నిబంధనలతో పని లేకుండా ఓ భారీ లేఅవుట్‌ వేయించారు. ప్రతిఫలంగా ఆయనకు లేఅవుట్లో రెండు ఎకరాలు ముట్టజెప్పారని తెలిసింది. అనుమతి లేకుండా వేసినందుకు పురపాలక అధికారులు లేఅవుట్లలో 2-4 సెంట్ల ధరను కమీషన్‌గా తీసుకుంటున్నారు.

నిబంధనలకు పాతర

సాగు భూమిని నివాసయోగ్యమైనదిగా కన్వర్షన్‌ చేసేందుకు లేఅవుట్‌లో ఎకరం భూమి విలువ రూ.కోటి ఉంటే రూ.6 లక్షలు  రుసుం చెల్లించాలి. జిల్లాలో 70 శాతం వెంచర్లలో ఈ ఛార్జీలు చెల్లించడం లేదు. సామాజిక అవసరాలకు 10 శాతం కామన్‌సైట్‌ వదలడం లేదు. సీనరేజ్‌ ఛార్జీలు చెల్లించాలని తెలిసినా ససేమీరా అంటున్నారు. చాలా లేఅవుట్లలో 33 శాతం రహదారులకు స్థలాల కేటాయింపు ఊసే లేదు.

ఈ విషయమై పశ్చిమగోదావరి జేసీ జేవీ మురళిని వివరణ కోరగా అనధికారిక లేఅవుట్లు  గుర్తించేందుకు విచారణ కమిటీని వేసి నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని