logo

యాజమాన్య పద్ధతులతో అధికోత్పత్తి

సాగులో తగిన యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే తక్కువ పెట్టుబడితోనే అధిక ఉత్పత్తి సాధన సాధ్యమేనని ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Published : 06 Feb 2023 05:36 IST

‘ఈనాడు’ ఫోన్‌ ఇన్‌లో కేవీకే శాస్త్రవేత్తలు

రైతుల సందేహాలు నమోదు చేస్తున్న శాస్త్రవేత్తలు

ఉండి, న్యూస్‌టుడే: సాగులో తగిన యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే తక్కువ పెట్టుబడితోనే అధిక ఉత్పత్తి సాధన సాధ్యమేనని ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో కేవీకే శాస్త్రవేత్తలతో నిర్వహించిన ‘ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకొచ్చారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ఎన్‌.మల్లికార్జునరావు, సస్యరక్షణ, పంటల యాజమాన్య విభాగాల శాస్త్రవేత్తలు ఎ.రాజేష్‌, వినయలక్ష్మిలు రైతుల సమస్యలు తెలుసుకొని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


* వరిలో జింకు ధాతు లోప లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి చర్యలు చేపట్టాలి. - సోమిరెడ్డి, పేకేరు, పెనుగొండ మండలం

జింకు ధాతు లోపం ఉన్న వరి చేల్లో పై నుంచి మూడు, నాలుగు ఆకుల మధ్య ఈనెలు పాలిపోయి ముదురాకు చివర్లో మధ్య ఈనెకు ఇరువైపులా తుప్పు రంగు మచ్చలు కన్పిస్తాయి. ఆకులు చిన్నవిగా మారి పెళుసుగా తయారవుతాయి.  దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేటు + 5 గ్రాముల యూరియాను కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలి.


* సందేహం: మాది మెరక చేను. సాగునీరు సరిగా అందదు. ఏఏ దశల్లో నీరందిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.

- పి.జోగేశ్వరరావు, వడలి, పెనుగొండ మండలం

సమాధానం: మూన తిరిగిన నాటి నుంచి దుబ్బు చేయడం పూర్తయ్యే వరకు పొలంలో పలచగా 2-3 సెంటీమీటర్ల మేర నీరుంటే సరిపోతోంది. అంతకంటే ఎక్కువ నీరుంటే పైరు బాగా దుబ్బు చేయదు. చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టి పడే వరకు 5 సెం.మీ. లోతున నీరుండాలి. కోతకు 10 రోజుల ముందు నీటిని తీసి పొలాన్ని ఆరబెట్టాలి.  


* మా భూముల్లో పెసర, మినుము పంటలేశాం. కలుపు యాజమాన్య పద్ధతులు తెలియజేయండి.

- రవికుమారు, నవుడూరు, పెనుమంట్ర మండలం

విత్తిన 20 - 25 రోజుల్లో మాగాణి చేల్లో ఊద, గరిక లాంటి గడ్డి జాతి మొక్కల నిర్మూలనకు ఫెనాక్సాప్రాప్‌ ఇథైల్‌ 9 శాతం ద్రావణాన్ని ఎకరానికి 250 మి.లీ లేదా క్విజలోపాప్‌ ఇథైల్‌ 5 శాతం ద్రావణం ఎకరానికి 400 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వెడల్పు ఆకు  జాతి కలుపు నివారణకు ఇమజితాఫిర్‌ 5 శాతం మందును 200 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి చల్లుకోవాలి.


* రబీ సాగులో ఎరువుల యాజమాన్య పద్ధతులను వివరించండి.

- భూపతిరాజు హరనాథరాజు, ఎన్నార్పీఅగ్రహారం, ఉండి మండలం

గోదావరి మండలానికి సిఫార్సు చేసిన పోషకాల మోతాదు ఎకరానికి నత్రజని - 72, భాస్వరం - 36, పొటాష్‌ - 24 కిలోలు. నత్రజని ఎరువును మూడు సమ భాగాలుగా చేసుకొని దమ్ము, దుబ్బు, అంకురం దశల్లో బురద పదునులో చల్లి 36-48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. భాస్వరాన్నిచ్చే ఎరువును దమ్ములోనే పూర్తిగా చల్లుకోవాలి. పొటాష్‌ ఎరువులను ఆఖరి దమ్ములో, అంకుర దశల్లో సమపాళ్లలో చల్లుకోవాలి.


* ఎంటీయూ 1121 వరి నాట్లేసి 12 రోజులవుతోంది. ఏఏ రకాల ఎరువుల వేయాలి.

బి.దుర్గాప్రసాద్‌, పెనుమదం, పోడూరు మండలం,

జె.రామలింగేశ్వరరావు, నరసాపురం

దుబ్బు చేసే సమయంలో అర బస్తా యూరియా 5 కిలోల వేప పిండిలో కలిపి బురద పదునులో చల్లుకోవాలి. 3వ దఫా అర బస్తా యూరియా, అర బస్తా పొటాష్‌ చిరుపొట్ట దశలో చల్లుకోవాలి.  


*  ఆక్వా కాలుష్యంతో నీరు కలుషితమై కొన్ని ప్రాంతాల్లో చౌడు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి నేలల్లో సాగు చేపట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి. 

కె.పద్మనాభం, ఎల్‌బీచర్ల

చౌడు భూముల్లో దెబ్బతిన్న వరిమూనలు

వరి సాగుకు ముందు పచ్చిరొట్ట పైరును పెంచి నేలలో కలియదున్నాలి. నాట్లు వేసే ముందు మంచి నీటిని 3-4 సార్లు పెట్టి నేలలోకి లవణాలను ఇంకించడం లేదా బయటకు పోయేలా చేసుకోవచ్చు. విత్తనాలను 0.1 శాతం ఉప్పు ద్రావణంలో 2-3 గంటల పాటు నానబెట్టి విత్తడం వల్ల ఉప్పు ప్రభావాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట వాడాలి. 25 - 35 రోజుల వయసుండి కుదురుకు ఎక్కువ మొక్కలుండే నారు వేసుకోవాలి. సిఫార్సు కన్నా 25 శాతం అదనంగా నత్రజని ఎరువులు వాడాలి. భూసార పరీక్షల ద్వారా క్షారం అధికంగా ఉందని గుర్తిస్తే సిఫార్సు మేరకు జిప్సం వేసుకోవాలి. వీటితో పాటు ఆమ్లగుణాన్ని కలిగించే యూరియా వాడితే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని