logo

పరిమిత వేగం.. ప్రమాద రహితం

ఎంత వేగంగా వాహనాన్ని నడిపామన్నది కాదు ముఖ్యం.. ఎంత క్షేమంగా గమ్యాన్ని చేరుకోగాలిగామనేదే ప్రధానం అని పలువురు సీనియర్‌ చోదకులు అన్నారు.

Published : 06 Feb 2023 05:36 IST

ఉత్తమ చోదకుల అనుభవ పాఠాలు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఎంత వేగంగా వాహనాన్ని నడిపామన్నది కాదు ముఖ్యం.. ఎంత క్షేమంగా గమ్యాన్ని చేరుకోగాలిగామనేదే ప్రధానం అని పలువురు సీనియర్‌ చోదకులు అన్నారు. ఆర్టీసీ రహదారి భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా ఏలూరులో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ చోదకులకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. వీరిలో ఒకరు జోనల్‌ స్థాయిలో ప్రథమ.. మరో ముగ్గురు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరు గత 22 నుంచి 33 ఏళ్లకు పైబడి ఒక్క ప్రమాదానికీ ఆస్కారం ఇవ్వకుండా బస్సులు నడపడం విశేషం. వీరి తమ అనుభవ పాఠశాలను ‘న్యూస్‌టుడే’కు వివారాలిలా..


అతి వేగం వద్దే వద్దు

నా పేరు బీవీఆర్‌ఎం రావు. ఏలూరు డిపోలో చోదకునిగా పనిచేస్తున్నా. గత 33 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. వాహనం నడిపేటప్పుడు పరిమిత వేగంతో మాత్రమే పయనించాలి. అతి వేగం అసలు వద్దు. సమయపాలన పాటిస్తే ప్రమాదాలకు అవకాశం ఉండదు. ఇంటి వద్ద ఉండే పరిస్థితులను పదే పదే గుర్తు చేసుకోవడాన్ని మానుకోవాలి. విధుల్లో ఏకాగ్రత వహించాలి. రహదారిపై వచ్చే వాహనాలను ప్రతి క్షణం గమనిస్తూ ఉంటేనే సురక్షితంగా ముందుకు వెళ్లగలం.


వాహనం కండీషన్‌లో ఉండాలి

నా పేరు డి.ప్రసాదరావు. ఏలూరు డిపోలో చోదకునిగా పనిచేస్తున్నా. గత 33 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. వాహనం ఎల్లపుడు కండీషన్‌లో ఉండేలా చూసుకోవాలి. కంటి చూపునే బ్రేకుగా వాడుకోవాలి. వాహనం ఆపాల్సిన ప్రాంతానికి కనీసం 200 మీటర్లకు ముందుగానే నెమ్మదిగా బ్రేకు వేస్తూ ఉండాలి. వాహనం నడిపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చరవాణిలో మాట్లాడకూడదు. మద్యం తాగి నడిపితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే.


ఏకాగ్రత అవసరం

నా పేరు బీపీ రావు. నూజివీడు డిపోలో చోదకునిగా పనిచేస్తున్నా. గత 32 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. వాహనం నడిపేటప్పుడు రహదారి నియమాలు కచ్చితంగా పాటించాలి. ఏకాగ్రతగా వాహనం నడపడం ఎంతో ముఖ్యం. అనువైన పరిస్థితుల్లో మాత్రమే ఇతర వాహనాలను ఓవర్‌టేక్‌ చేయాలి. ఫ్లై ఓవర్లపై అసలు చేయకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, వైద్యశాలల వద్ద జాగరూకత వహించాలి. ఏదైనా ఊరి మీదుగా వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా వేగ నియంత్రణ పాటించాలి.


కుటుంబాన్ని గుర్తుంచుకోవాలి

నా పేరు జె.చల్లయ్య. ఏలూరు డిపోలో చోదకునిగా పనిచేస్తున్నా. గత 29 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా. వాహనాన్ని నడిపేటప్పుడు మన కుటుంబాన్ని, మనపై ఆధారపడి జీవిస్తున్న వారి గురించి గుర్తుంచుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాన్ని అదుపు తప్పనివ్వబోం. అలాగే బస్సులో 40 నుంచి 50 మంది వరకు ప్రయాణికులుంటారు. వారందరి జీవితాలు చోదకుని చేతిలో ఉన్నాయని గుర్తుంచుకుంటే సురక్షితంగా గమ్యస్థానం చేరుకోగలం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని