logo

రైతుకు దక్కని యంత్ర భరోసా

సాగులో ఉత్పాదక వ్యయం తగ్గించుకుని పనులు సులభతరం చేసుకోవడానికి ప్రభుత్వం రాయితీపై అందించే యంత్ర పరికరాలు సరిగ్గా అందక రైతులు అవస్థలు పడుతున్నారు.

Published : 06 Feb 2023 05:36 IST

సాగుకు అదనపు భారం

యంత్రంతో వరి కోత

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సాగులో ఉత్పాదక వ్యయం తగ్గించుకుని పనులు సులభతరం చేసుకోవడానికి ప్రభుత్వం రాయితీపై అందించే యంత్ర పరికరాలు సరిగ్గా అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కూలీలతో పనులు చేయించాలంటే వ్యయం రెట్టింపవుతోంది. అధిక మొత్తం బాడుగ చెల్లించి బయట యంత్రాలను వినియోగిస్తున్న కర్షకులకు సాగు అదనపు భారంగా మారింది.

ఉమ్మడి జిల్లాలో 929 రైతు భరోసా కేంద్రాలు ఉండగా ప్రతి దాని పరిధిలో ఒక వినియోగదారుల అద్దె కేంద్రం (కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతిచోట ఐదుగురు ఔత్సాహిక రైతులను ఎంపిక చేసి వారిని ఒక బృందంగా ఏర్పాటు చేయాలి. ఇలా ఉమ్మడి జిల్లాలో వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకంలో 2020-21 సంవత్సరం రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు ఇవ్వలేదు. 2021-22లో 459 సీహెచ్‌సీ సంఘాలకు రూ.68.85 కోట్ల విలువైన యంత్ర పరికరాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా.. 218 సంఘాలకు రూ.66.30 కోట్ల విలువైనవి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. ఇక 2022 -23 ఆర్థిక సంవత్సరం ఆఖరికి వస్తున్నా ఇప్పటివరకూ ఒక్క యంత్ర పరికరమూ మంజూరు చేయలేదు. ఒక యూనిట్‌ విలువలో రైతు వాటా 10 శాతం, బ్యాంకు రుణం 50, రాయితీ 40 శాతం ఉంటుంది. పథకం ఆరంభం నుంచి 1090 మంది రైతులు మాత్రమే లబ్ధి పొందారు.

నెరవేరని ప్రభుత్వ లక్ష్యం..

వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద ఆర్‌బీకేల్లో సీహెచ్‌సీల ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దె ప్రాతిపదికన అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి మూడేళ్లు దాటినా చాలాచోట్ల అందడం లేదు. యంత్ర పరికరాలు అందక సన్న, చిన్నకారు రైతులు ప్రైవేటు యంత్రాలకు అధిక అద్దె చెల్లిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు 49 హార్వెస్టర్లు ఇచ్చినా తక్కువ మంది రైతులకు సేవలు అందుతున్నాయి. చాలాచోట్ల కేంద్రాల నిర్వహణ జాడ లేకుండాపోయింది. తద్వారా ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడుతోంది. అధికారులు స్పందించి రాయితీ యంత్ర పరికరాలను సీహెచ్‌సీల ద్వారా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపుతున్నాం..

‘అర్హత కలిగిన రైతు సంఘాలకు అవసరమైన యంత్ర పరికరాలు అందించేందుకు జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. మార్చిలో యూనిట్లు గ్రౌండింగ్‌ చేయించేందుకు చర్యలు చేపడుతున్నాం’ అని పశ్చిమ, ఏలూరు జిల్లాల వ్యవసాయాధికారులు జెడ్‌.వెంకటేశ్వరరావు, వై.రామకృష్ణ తెలిపారు.

ఖరీఫ్‌లో ఒక ఎకరం విస్తీర్ణంలో వరి సాగు చేశా. కూలీలతో కోత కోయించి కట్టేత కట్టి ట్రాక్టరుతో నూర్పిళ్లు చేసినందుకు రూ.13,200 ఖర్చయింది. అదే యంత్రంతో కోత కోయిస్తే రూ.3 వేలతో పనైపోతుంది. గ్రామంలో సీహెచ్‌సీ లేదు. యంత్రాలు అద్దె ప్రాతిపదికన ఇచ్చే విధానం అమలుకావడం లేదు. దీనిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కూలీలతో పనులు చేయించాలంటే సాగు భారంగా మారింది.

వై.శివ, చొదిమెళ్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని