logo

వాహన మిత్రకు ని‘బంధనాలు!

ఎంతో మంది యువకులు స్వయం ఉపాధి కోసం వాహన రంగాన్ని నమ్ముకున్నారు. వారికి ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ తదితర వాహనాలు కలిగిన అర్హులకు రూ.10 వేల చొప్పున ఇస్తోంది.

Updated : 06 Feb 2023 05:47 IST

పథకానికి  దూరమవుతున్న లబ్ధిదారులు

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఎంతో మంది యువకులు స్వయం ఉపాధి కోసం వాహన రంగాన్ని నమ్ముకున్నారు. వారికి ఆసరాగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ తదితర వాహనాలు కలిగిన అర్హులకు రూ.10 వేల చొప్పున ఇస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత పలు నిబంధనలను విధించింది. ఫలితంగా చాలామంది పథకానికి దూరమవుతున్నారు.

జిల్లాలో 20 వేలకు పైగా ఆటోలు, 12 వేల వరకు ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌లున్నట్లు అంచనా. ఆయా వాహన దారులకు ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తోంది. 2019-20 సంవత్సరం పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో వాహనదారులకు అధికారులు అవగాహన కల్పించారు. ఇలా 17,101 మందిని అర్హులుగా గుర్తించి పథకాన్ని అమలు చేశారు. 2020-21 సంవత్సరం 19,521 మందికి ఇచ్చారు. పథకానికి సంబంధించి ఇంట్లో ఒకరు మాత్రమే అర్హులు. మరో వ్యక్తికి కారు, మరేదైన వాహనం ఉంటే అనర్హులుగా పరిగణిస్తారు. వాహన రిజిస్ట్రేషన్‌, యజమానికి చోదక అనుమతి పత్రం తప్పనిసరి. విద్యుత్తు బిల్లు నెలకు 300 యూనిట్లకు మించరాదు. ఇలా పలు నిబంధనలు విధించడంతో లబ్ధిదారుల జాబితాలో కోత పడుతోంది. రెండో విడతకు లబ్ధిదారుల సంఖ్య పెరిగినా.. మూడు, నాలుగో జాబితాల్లో పలువురి పేర్లు తొలగించినట్లు తెలుస్తోంది. గతేడాది లబ్ధి పొందిన వారిలో కొందరి పేర్లు లేవు. తమ పేర్లు అర్హుల జాబితాలో ఎందుకు రాలేదని లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని వీరికి సూచిస్తుంటే ఇప్పటికే రెండుసార్లు లబ్ధి పొందామని.. కొత్తగా మళ్లీ దరఖాస్తు ఏమిటని నిలదీస్తున్నారు. కొంతమంది వాహనాలు విక్రయించినా రికార్డులు తమ వద్దే ఉంచుకోవడంతో పాత యజమానికే పథకం వర్తిస్తోంది.  

ఈ విషయమై ఆర్టీవో శ్రీహరితో ‘న్యూస్‌టుడే’ మాట్లాడగా అర్హులైన ప్రతి వాహనదారుడికి పథకం వర్తిస్తుందని, ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వెంటనే దరఖాస్తు చేసుకుంటే మళ్లీ వారికి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు.


ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు

నేను వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం ద్వారా మొదటి విడతలో లబ్ధి పొందాను. ఆ మరుసటి ఏడాది అర్హుల జాబితా నుంచి నా పేరు తొలగించారు. ఎందుకు తొలగించారని సచివాలయ సిబ్బందిని అడిగితే ఆన్‌లైన్‌ సమస్యతో పరిశీలనలో తొలగిపోయి ఉండవచ్చని తెలిపారు. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్తే మరోసారి దరఖాస్తు చేసుకుంటే తర్వాత జాబితాలో ఎంపిక చేస్తారని వివరించారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ రాలేదు. 

బుద్ద నాగ సూర్యనారాయణ, ఆటో డ్రైవర్‌, ఏలూరు


ఇలా ఇస్తూ అలా లాగేసుకుంటున్నారు

ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద రూ.10 వేలు ఇస్తున్నారు. ఎఫ్‌సీలు, రోడ్డు ట్యాక్స్‌ చెల్లించలేదంటూ ఆటోను నడిరోడ్డుపై ఆపి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా  విధిస్తున్నారు. ఇలా ఒక పక్క ఇస్తూనే.. మరో పక్క లాగేసుకుంటున్నారు.  నిబంధనల పేరుతో ఎంతోమందికి పథకం రాకుండా చేస్తున్నారు.

బండి గంగాధర్‌, ఆటో డ్రైవర్‌


విద్యుత్తు బిల్లు ప్రామాణికం కారాదు.. డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న ప్రతి ఆటో, క్యాబ్‌, మ్యాక్సీ డ్రైవర్లకు వాహనమిత్ర పథకం వర్తింప చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్తు బిల్లు ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు. 300 యూనిట్లు రావడం సాధారణం. గ్రామ, వార్డు సచివాలయాలకు నమోదును అప్పగించారు. వారికి సరైనా అవగాహన ఉండటం లేదు. ఇంతకు ముందులా ఆన్‌లైన్‌, మీసేవా కేంద్రాల్లో నమోదుకు అవకాశం కల్పించాలి. వాహన మిత్ర నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను  తొలగించి అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాం.

గోపి, అధ్యక్షుడు, ఏపీ ఆటో, ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని