logo

ఇంటింటా అమృత ధార

ఆకివీడు, చింతలపూడి నగర పంచాయతీల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు అమృత్‌-2.0లో నిధులు మంజూరయ్యాయి. దీంతో పాటు పలు పట్టణాల్లో చెరువుల ఆధునికీకరణకూ కేటాయించారు.

Published : 07 Feb 2023 06:00 IST

రెండు నగర పంచాయతీలకు నిధులు

ఆకివీడులో అభివృద్ధి చేయనున్న దొరగారి చెరువు

ఆకివీడు, భీమవరం పట్టణం, పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: ఆకివీడు, చింతలపూడి నగర పంచాయతీల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు అమృత్‌-2.0లో నిధులు మంజూరయ్యాయి. దీంతో పాటు పలు పట్టణాల్లో చెరువుల ఆధునికీకరణకూ కేటాయించారు. 2025-26 నాటికి పూర్తిచేయాల్సి ఉంది. గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష జనాభా దాటిన ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాలను అమృత్‌ పథకం తొలివిడతలో చేర్చారు. వీటికి తొలివిడతగా రూ.223.76 కోట్లు విడుదలవగా చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పథకాన్ని మిగిలిన పట్టణాలకు విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆకివీడు, చింతలపూడి నగరపంచాయతీలకు తాజాగా నిధులు మంజూరు చేశారు. ఇంటింటా కుళాయి కనెక్షన్లకు సంబంధించి ఆకివీడుకు రూ.5.90 కోట్లు, చింతలపూడి నగరపంచాయతీకి రూ.7.18 కోట్లు వెచ్చించనున్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలను ప్రజారోగ్య శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.

చెరువుల ఆధునికీకరణ.. అమృత్‌-2.0లో  చెరువులను ఆధునికీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ద్వారా ఈ పనులు చేయనున్నట్లు ప్రజారోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఆకివీడులో దొరగారి చెరువు అభివృద్ధికి రూ. 67 లక్షలు, చింతలపూడిలో వేగిలింగేశ్వరస్వామి చెరువుకు రూ.88 లక్షలు, పాలకొల్లులో చుండూరివారి చెరువుకు రూ.2.18 కోట్లు, తణుకులోని కొమ్మయ్యచెరువుకు రూ.2.02 కోట్లు, నరసాపురంలో నాగారమ్మ చెరువుకు రూ.1.31 కోట్లు, జంగారెడ్డిగూడెంలో అంకమ్మకోనేరుకు రూ.1.20 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ చెరువుల గట్లను వెడల్పు చేసి పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు నడక బాట, సందర్శకుల కోసం బల్లలు, ఇతరత్రా ఏర్పాట్లు చేస్తారు. అమృత్‌ 2.0లో చేపట్టాల్సిన పనులకు టెండరు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజారోగ్య శాఖ ఈఈ ఆర్‌.విజయ్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని