logo

బడుగు జీవులపై మృత్యు శకటం

వారంతా రోజువారీ కూలీలు. కాయకష్టం చేసుకుని జీవించే బడుగు జీవులు. పొలం పనులకు వెళ్లి వచ్చిన సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరికి ట్రాక్టర్‌ రూపంలో ప్రమాదం ఎదురైంది.

Published : 07 Feb 2023 06:08 IST

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు మహిళా కూలీల దుర్మరణం
10 మందికి గాయాలు

క్షతగాత్రులకు చికిత్స

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: వారంతా రోజువారీ కూలీలు. కాయకష్టం చేసుకుని జీవించే బడుగు జీవులు. పొలం పనులకు వెళ్లి వచ్చిన సంపాదనతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరికి ట్రాక్టర్‌ రూపంలో ప్రమాదం ఎదురైంది. వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టరు చెరువులో బోల్తా కొట్టిన ఘటన గూడెం మండలం మాధవరం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు...మాధవరం గ్రామానికి చెందిన కుచ్చెర్ల రామారావు సొంత ట్రాక్టర్‌పై పొలం పనులకు కూలీలను తీసుకెళ్తుంటారు. ఎప్పటిలాగానే అప్పారావుపేటకు చెందిన 11 మంది  కూలీలను పొలంలో కలుపుతీతకు మాధవరం తీసుకెళ్లారు. పనులు ముగించుకుని వారిని ఇంటికి తీసుకెళ్తుండగా కోతిగుంట చెరువు వద్ద వాహనం అదుపు తప్పి చెరువు గట్టు కింద బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అప్పారావుపేటకు చెందిన పాక భారతి (47), ఆకుమర్తి సుజాత(36) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ రామారావు, ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న జొన్నాడ శివ జ్యోతి, పెరుమళ్ల నాగలక్ష్మి, మిద్దే పద్మ, కోట సింహాచలం, పెరుమళ్ల రామలక్ష్మి, పెరుమళ్ల కోట సత్తెమ్మ, తానేటి వరలక్ష్మి, షేక్‌ మస్తాన్‌ బీబి, మడిపల్లి సుబ్రహ్మణ్యంలకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను వైద్యం నిమిత్తం కొందరిని పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి, మరి కొందరిని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను  పంచనామా నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌


* ప్రమాదంలో మృతి చెందిన పాక భారతి భర్త కొన్నేళ్ల కిందట మృతి చెందారు. కూలి పనులు చేసుకుంటూనే తనకున్న ఏకైక కుమార్తెకు ఘనంగా వివాహం చేసి, అత్తారింటికి పంపారు.


* ఆకుమర్తి సుజాతకు భర్త వెంకటేశులు ఉన్నారు. వీరికి ఒక కుమార్తె హాసిని. ఆమెకు కొన్నేళ్ల కిందట వివాహం చేశారు.


మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం: కొట్టు

ప్రమాద సమాచారం తెలుసుకున్న మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. గాయాలైనవారికి ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని