logo

విలీన ముసుగులో కుంభకోణం

వెంకటాపురం, శనివారపుపేట, చొదిమెళ్ల, సత్రంపాడు, పోణింగి, కొమడవోలు, తంగెళ్లమూడి పంచాయతీలను ఏలూరు నగరపాలికలో విలీనం చేశారు.

Published : 23 Mar 2023 04:38 IST

66 మంది పొరుగు సేవల ఉద్యోగుల తొలగింపు
ముడుపులు తీసుకుని కొత్తవారికి కొలువులు
ఉద్యోగాలు పంచుకున్న నాయకులు, అధికారులు
ఈనాడు డిజిటల్‌, ఏలూరు

విలీన పంచాయతీల్లో పని చేసే కొందరు పొరుగు సేవల ఉద్యోగులను అకారణంగా తొలగించారు. అధికారులు, నాయకులు కుమ్మక్కై భారీ కుంభకోణం చేశారు. ముడుపులిచ్చినవారికి ఆ కొలువులు కట్టబెట్టారు. అదనపు నియామకాల్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

వెంకటాపురం, శనివారపుపేట, చొదిమెళ్ల, సత్రంపాడు, పోణింగి, కొమడవోలు, తంగెళ్లమూడి పంచాయతీలను ఏలూరు నగరపాలికలో విలీనం చేశారు. ఆయా పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్యకార్మికులు, వాటర్‌ వర్కర్లు, ట్యాంకు వాచ్‌మెన్లు, శానిటరి మేస్త్రీలు, ప్రజారోగ్య సిబ్బందిని 2021లో అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. 437 మంది ఉద్యోగులుంటే వీరిలో అన్ని అర్హతలు ఉన్నా 66 మందిని అకారణంగా తొలగించారు. వీరి స్థానాలను నాయకులకు నచ్చిన..అధికారులకు మెచ్చిన వారితో భర్తీ చేశారు. తొలగించిన వారికి విషయం తెలియక కార్పొరేషన్‌ చుట్టూ తిరిగారు. అధికారులు మాత్రం రేపు మాపు అంటూ మభ్యపెట్టి చావుకబురు చల్లగా చెప్పారు. తొలగించిన ఉద్యోగులు ఆర్థిక, రాజకీయ బలం లేని వారు కావటంతో చేసేది లేక మిన్నకున్నారు.

నిబంధనలకు తిలోదకాలు

ఉద్యోగుల్లో 66 మందిని తొలగించటంతో పాటు కార్పొరేషన్‌లో డేటాఎంట్రీ ఆపరేటర్లు అవసరమని మరో 8 మంది కొత్తవారిని ఎంపిక చేసుకున్నారు. కార్పొరేషన్‌లో ఉద్యోగాల ఖాళీల వివరాలు ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్సింగ్‌ సర్వీసెస్‌కు(ఏపీసీఓఎస్‌) పంపించలేదు. ఇందుకు సంబంధించి నోటిఫికేషనే జారీ చేయలేదు. ధరఖాస్తుల స్వీకరణ, అభ్యర్థుల ఎంపిక, రోస్టర్‌ నియమాలు ఇవేమీ లేకుండానే కొత్త వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కార్పొరేషన్‌లో ఉన్నత అధికారి తన బంధువుకు అక్రమంగా డేటాఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగం ఇప్పించారు.


తిలాపాపం తలా పిడికెడు

ద్యోగుల విలీన ప్రక్రియలో కార్పొరేషన్‌లో ఓ బడాబాబు, ఓ నియోజకవర్గ నేత, జిల్లాలో స్థాయిలో ఓ ఉన్నతాధికారి, కార్పొరేషన్‌లో ఉన్నత స్థాయి అధికారి కుమ్మ·క్కై ఉద్యోగాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా ఉద్యోగం పొందిన ఒక్కో ఉద్యోగి రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ ముడుపులు సమర్పించారు. అంటే 66 ఉద్యోగాలకు రూ.3 లక్షల చొప్పున దాదాపు రూ.2 కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటికి రాకుండా కార్పొరేషన్‌ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చిన వారి పేర్లు కూడా పంచాయతీలో పని చేసిన నిజమైన ఉద్యోగుల జాబితాలో చేర్చారు. ఉద్యోగాలు తీసేసిన వారి పేర్లు తొలగించారు. దీంతో కార్పొరేషన్‌ ఉద్యోగులు పంచాయతీ నుంచి వచ్చిన జాబితాలో ఉన్నవారికి నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చినట్లు మాయ చేస్తున్నారు. ఈ విషయంపై కమిషనర్‌ వెంకట కృష్ణ దగ్గర ప్రస్తావించగా ఉద్యోగాల భర్తీ విషయంలో పంచాయతీ ఇచ్చిన జాబితాలో వారినే భర్తీ చేశామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని