logo

లైడార్‌ సర్వేనే ప్రామాణికం

గోదావరికి చిన్నపాటి వరదొస్తే చాలు.. ఆ గ్రామం వరదలోనే ఉంటుంది. కానీ జల వనరులశాఖ అంచనాల ప్రకారం ఆ గ్రామం 45.72 కాంటూరులోకి వచ్చింది.

Published : 23 Mar 2023 04:38 IST

మరో 19 గ్రామాలకు మొదటి దశలోనే పునరావాసం

శాటిలైటు లింకుకు అనుసంధానంగా ముంపు ప్రాంతంలో వేసిన మార్కు

కుక్కునూరు, న్యూస్‌టుడే: గోదావరికి చిన్నపాటి వరదొస్తే చాలు.. ఆ గ్రామం వరదలోనే ఉంటుంది. కానీ జల వనరులశాఖ అంచనాల ప్రకారం ఆ గ్రామం 45.72 కాంటూరులోకి వచ్చింది. కాంటూరు లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు అసలు పొంతన కుదరటం లేదు. పరిహారం ఇవ్వాలంటే తప్పనిసరిగా మొదటిదశ పునరావాసంలోకి చేర్చాలి. ఇందుకు సాంకేతిక అనుమతులు అవసరం. ఈ పరిస్థితులున్న గ్రామాలు దాదాపు 25 వరకూ ఉన్నాయి. ఆ మధనంలోంచి పుట్టిందే లైడార్‌ సర్వే.

2021 డిసెంబరులో..  సాధారణ సర్వే ఏళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో అధికారుల మదిలో తట్టింది ‘లైడార్‌’ సర్వే. సెంటీ మీటరు తేడాను కూడా స్పష్టం చేయగల లైడార్‌ సాంకేతిక డీజీపీఎస్‌(డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టం) ద్వారా అయితే త్వరితగతిన సర్వే తేలటమే కాకుండా, ఏ గ్రామం ఏ కాంటూరు పరిధిలో ఉందో స్పష్టమవుతుందనే ఆలోచనతో అధికారులు ఆ సర్వేను ఆశ్రయించారు.  2021 డిసెంబరు లో నిర్వహించి.. జిల్లాలోని మరో 19 గ్రామాలు వరద ముంపులో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే 25 గ్రామాలు జల వనరుల శాఖ సర్వే ప్రకారం మొదటి దశ (41.15 కాంటూరు) పునరావాసంలో ఉండగా, అదనంగా మరో 19 గ్రామాలకు ఆ దశలోనే పునరావాసం చూపటం అవశ్యంగా గుర్తించారు. ఆ ప్రక్రియలో భాగంగానే ప్రస్తుతం ఆ 19 గ్రామాలకు పునరావాసం చూపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాంటూరు మార్చలేరు.. కనుక.. ఆ 19 గ్రామాలు కొద్దిపాటి వరదకే మునుగుతుంటాయి. అలా అని వాటిని ఎప్పుడో నిర్ధారించిన 41.15 కాంటూరులోకి తీసుకురాలేరు. అలా చేసేందుకు సాంకేతికపరమైన అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిదశ పునరావాసం పేరిట కొత్త పదం తీసుకువచ్చారు. ఆ గ్రామాలు మిగిలిన గ్రామాలతో పాటు 45.72 కాంటూరులోనే ఉంటాయి. కానీ పునరావాసంలో మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చూపి, ఇప్పుడు ఆ గ్రామాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. గ్రామసభలు ఇళ్లు, ఆవరణలోని చెట్లు, ఇతర కట్టడాలు ను సర్వే చేసి, ఆ తర్వాత రూఢీ ప్రకటన విడుదల చేస్తారు. అంటే మరో 90 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు