మేమేం పాపం చేసుకున్నాం!

కొందరు అధికారులు..మరికొందరు నాయకుల ధనదాహానికి  చిరుద్యోగులు బలై పోయారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కొలువుల్లోంచి నిర్దాక్షిణ్యంగా తప్పించటంతో దిక్కులేని వారిగా మిగిలారు.

Updated : 24 Mar 2023 06:45 IST

రోడ్డున పడిన పొరుగు సేవల సిబ్బంది 
తమ ఉద్యోగాలు ఇప్పించాలని వేడుకోలు

కొందరు అధికారులు..మరికొందరు నాయకుల ధనదాహానికి  చిరుద్యోగులు బలై పోయారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కొలువుల్లోంచి నిర్దాక్షిణ్యంగా తప్పించటంతో దిక్కులేని వారిగా మిగిలారు. పోరాడే ధైర్యం లేక గట్టిగా ప్రశ్నిస్తే ఎప్పటికీ ఉద్యోగం రాదన్న భయంతో పంటిబిగువున భరిస్తున్నారు. నాయకుల  కాళ్లావేళ్లా పడినా కాలం వెళ్లదీస్తున్నారే తప్ప కనికరించే నాథుడే కనిపించడం లేదు.

ఈనాడు డిజిటల్‌, ఏలూరు : విలీన పంచాయతీల సిబ్బందిని ఏలూరు కార్పొరేషన్లో కలిపే క్రమంలో ఉద్యోగాలు తొలగించిన వారి వేదన అరణ్యరోదనగా మిగిలింది.  66 మందిని అకారణంగా తొలగించారు. ‘మీ పేరు విలీన జాబితాలో లేదు..మీరు రేపటి నుంచి రావాల్సిన పని లేదు’ అని అధికారులు చెప్పడంతో వారు దిగ్భ్రాంతి చెందారు. వీరిలో దశాబ్దాలుగా విధుల్లో ఉన్నవారు ఉన్నారు. నాయకులు, అధికారులు కుమ్మక్కై భారీ స్థాయిలో ముడుపులు తీసుకుని వారికి నచ్చిన వారికి కొలువులు కట్టబెట్టారు. కార్పొరేషన్‌లో డీఈ దగ్గర నుంచి కమిషనర్‌ వరకూ..నాయకుల్లో కార్పొరేటర్‌, మేయర్‌, ఎమ్మెల్యే వరకూ కాళ్లరిగేలా తిరిగారు. ఉద్యోగం కోసం ప్రాధేయ పడ్డారు. కొందరు అధికారులను కలిస్తే మీ ఉద్యోగం ఎక్కడికీ పోదు తప్పకుండా వస్తుందని చెప్పి పంపిచేశారు.  

పూటగడవక పాట్లు

విలీనం చేసిన తర్వాత కూడా తొలగించిన ఉద్యోగులు ఆరు నెలల వరకు విధులకు వెళ్లారు. అందులో 4 నెలల జీతం ఇప్పటికి ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగం పోయి.. చేసిన పనికి జీతం రాక ఉద్యోగులకు పూట గడవటం కూడా కష్టమైంది. ఉద్యోగం ఇస్తారన్న నమ్మకం లేక కొందరు హోటళ్లలో, మరికొందరు ఇళ్లలో పాచి పనులు చేస్తున్నారు. ఇంకొందరు కూలిపనులకు వలస వెళ్లిపోయారు. ఈ అంశంపై కమిషనర్‌ వెంకట కృష్ణ వివరణ కోరగా పంచాయతీ ఇచ్చిన జాబితా ప్రకారమే ఉద్యోగులను విలీనం చేశారు.. జీతాల బకాయిల గురించి పరిశీలించి త్వరలో జమ చేస్తామన్నారు.

కుటుంబానికి నేనే దిక్కు:

వెంకటాపురం పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా నాలుగేళ్లు పనిచేశా. విలీనం చేసినప్పుడు నా తోటి ఉద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. నా పేరు జాబితాలో లేదన్నారు. మా నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాకు చిన్నపాప ఉంది. కుటుంబం మొత్తం నా సంపాదనతోనే బతకాలి. ఆరు నెలల నుంచి నానా అవస్థలు పడుతున్నా. కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నా. ఉద్యోగం  ఇప్పించండి.

పులివర్తి కమల్‌కుమార్‌ ఏలూరు,

అన్యాయంగా తొలగించారు:

కార్పొరేషన్‌ అధికారులు, నాయకులు కుమ్మక్కై లంచాలు తీసుకుని నిరుపేద ఉద్యోగులను అన్యాయంగా తొలగించారు. కొందరిని భయపెట్టి బయటకు రాకుండా చేస్తున్నారు. మీ ఉద్యోగాలు ఇచ్చేస్తాం అని మాయమాటలు చెబుతున్నారు. ఈ అంశం గురించి కార్పొరేషన్‌ అధికారులను సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేస్తున్నారు.

గళ్ళా సునీల్‌కుమార్‌, ఐఎన్‌టీయూసీ జిల్లా జనరల్‌ సెక్రటరి

రోడ్డున పడేశారు:

వెంకటాపురం పంచాయతీలో ట్యాంకు ఆపరేటర్‌గా 12 ఏళ్లు పనిచేశా. ఉద్యోగం తీసేసి నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు. విలీనం చేసిన తర్వాత కూడా ఆరు నెలలు పని చేశా. 4 నెలల జీతం ఇప్పటికీ ఇవ్వలేదు. ఎమ్మెల్యే, మేయర్‌, కార్పొరేషన్‌ అధికారుల దగ్గరికి వెళ్లినా ప్రయోజనం లేదు. దీంతో కుటుంబ పోషణ భారం కావటంతో ప్రస్తుతం హోటల్‌లో పని చేస్తున్నా. నా ఉద్యోగం ఇప్పించండి

తవిటినాయుడు, ఏలూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని