logo

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి బారిన పడకుండా అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం

Updated : 24 Mar 2023 05:53 IST

నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం

అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది

 జిల్లాలో నమోదైన కేసులు

* ఈ ఏడాది జనవరి నుంచి ఇంతవరకు: 685
* గతేడాదిలో నమోదైనవి : 3,684  

బుట్టాయగూడెం, పెనుగొండ, పోడూరు, న్యూస్‌టుడే : క్షయ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి బారిన పడకుండా అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని నిర్ధారణ అయితే తగ్గే వరకు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు పోషకాహారం తీసుకుని నివారించుకోవడం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు. ఏటా దేశంలో నమోదు అవుతున్న మరణాల్లో క్షయ వ్యాధి మరణాలే సుమారు 4.80 లక్షలు ఉంటున్నాయి. రోజుకు సుమారు 40 వేల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రత్యేక యూనిట్ల ద్వారా పరీక్షలు, చికిత్సలు

క్షయ మైక్రో బాక్టీరియం ట్యూబర్‌క్యులై అనే బాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. రోగి దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా(వెంట్రుకలు, గోర్లు తప్ప) సోకుతుంది. ఈ వ్యాధి రెండు రకాలు. ఒకటి ఊపిరితిత్తులకు సంక్రమించేది. దీనిని కఫం లేదా కళ్లె పరీక్ష ద్వారా నిర్ధరిస్తారు. రెండోది శరీరంలోని ఇతర భాగాలకు సోకేది. దీనిని ఎక్స్‌రే, స్కానింగ్‌, ఎఫ్‌ఎన్‌ఏసీ ద్వారా తేల్చుతారు.  

పోషకాహారం ముఖ్యం

క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్సతో పాటూ పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్‌ అభియాన్‌ పథకం కింద నెలకు రూ.500 చొప్పున ఆర్నెళ్ల పాటు అందిస్తున్నారు. మన్యం ప్రాంతంలో అదనంగా మరో రూ.750 ఇస్తున్నారు.

స్పందిస్తున్న దాతలు

కేంద్ర ప్రభుత్వ పథకంతో పాటూ జిల్లాలో 51 మంది దాతలు 81 మంది క్షయ బాధితులను దత్తత తీసుకుని పోషకాహారంతో కూడిన ఫుడ్‌ బాస్కెట్లు అందిస్తున్నారు. 482 మంది మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల పర్యవేక్షణలో గ్రామాల్లో రోగులకు చికిత్స అందిస్తున్నాం.  

డాక్టర్‌ జి.రత్నకుమారి, జిల్లా క్షయ నివారణాధికారిణి

* నేషనల్‌ టీబీ ఎలిమినేట్‌ ప్రోగ్రాం కింద జిల్లాలో బుట్టాయగూడెం, పోలవరం, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం, ఏలూరు, లింగపాలెం. కైకలూరు, నూజివీడు, దెందులూరు, భీమడోలులలో టీబీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. సీనియర్‌ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌, సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ చేత ట్రూనాట్‌ యంత్రం ద్వారా క్షయ పరీక్షలు చేసి నిర్ధరణ అయితే ఉచితంగా చికిత్సలు అందిస్తున్నారు. పీహెచ్‌సీల్లో మైక్రోస్కోప్‌ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు జిల్లాలో ఇటీవల ప్రత్యేక సర్వే నిర్వహించారు.
మన్యం మండలాల్లో  125 కేసులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని