logo

పోలవరం రైతులకు అదనపు పరిహారం

పోలవరం ప్రాజెక్టు నిమిత్తం 2006 నుంచి 2010 మధ్య సేకరించిన భూములకు ఎట్టకేలకు అదనపు పరిహారం ఇచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Updated : 31 Mar 2023 05:55 IST

అధికార యంత్రాంగం కసరత్తు

వింజరం గ్రామం

కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిమిత్తం 2006 నుంచి 2010 మధ్య సేకరించిన భూములకు ఎట్టకేలకు అదనపు పరిహారం ఇచ్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అప్పట్లో భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు రూ.1.15 లక్షల నుంచి రూ.1.45 లక్షల వరకు పరిహారం ఇచ్చారు. 2017లో జరిగిన భూసేకరణలో ఎకరాకు రూ.10.50 లక్షలు చెల్లించారు. దీంతో ముందుగా భూములిచ్చిన రైతులు తమకు అదనపు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యను విన్నవించగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో తీసుకున్న పరిహారంతో కలిపి ఎకరాకు రూ.5 లక్షల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఆ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు వంటి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఇలా అందిస్తారు... పోలవరం ప్రాజెక్టు కోసం 2006, 2007, 2010 సంవత్సరాల్లో భూసేకరణ చేశారు. మెట్ట భూములకు ఎకరాకు రూ.1.15 లక్షలు, చిన్న నీటివనరుల కింద భూములకు రూ.1.30 లక్షలు, మధ్యతరహా నీటి వనరులతో సాగయ్యే భూములకు రూ.1.45 లక్షల వంతున రైతులకు పరిహారం అందజేశారు. ఆ భూములకు గతంలో ఇచ్చిన పరిహారం పోను మిగిలిన సొమ్ము చెల్లించబోతున్నారు. ఉదాహరణకు ఎకరాకు రూ.1.45 లక్షలు చెల్లించిన భూమికి ఇప్పుడు రూ.3.55 లక్షలు పరిహారం చెల్లిస్తారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అప్పట్లో 8,539.83 ఎకరాలు సేకరించినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

వివరాలు విడుదల.. ప్రభుత్వం నుంచి అదనపు పరిహారం పొందే రైతుల వివరాలను ఏలూరులోని భూసేకరణ కార్యాలయం విడుదల చేసింది. అప్పట్లో జరిగిన అవార్డు సంఖ్య, అందజేసిన పరిహారం, ప్రస్తుతం చెల్లించే మొత్తం వివరాలను అందులో పొందుపరిచారు. ఆ జాబితాలోని రైతులు తమ బ్యాంకు ఖాతా పుస్తకాలు, ఆధార్‌ కార్డు నకళ్లను సంబంధింత గ్రామ సచివాలయాల్లో అందజేయాలని గ్రామాల్లో చాటింపుల ద్వారా తెలియజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు