logo

యువకులు.. కండల వీరులు

నేటి యువత చదువుతోపాటు పలు రంగాల్లో ప్రతిభ చాటుతున్నారు. శరీర సౌష్ఠవానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు.

Published : 31 Mar 2023 04:38 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: నేటి యువత చదువుతోపాటు పలు రంగాల్లో ప్రతిభ చాటుతున్నారు. శరీర సౌష్ఠవానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కండల వీరులుగా పతకాలు సాధించడంతోపాటు క్రీడా కోటాలో ఉపాధి పొందుతున్నారు. మరికొందరు సినీ, ఇతర రంగాల్లోని ప్రముఖులకు రక్షకులుగా కొనసాగుతున్నారు.  జాతీయ క్రీడాకారుడు ఎన్‌.వి.ఆర్‌ దాస్‌ స్మారక రాష్ట్రస్థాయి దేహదారుఢ్య పోటీలు భీమవరం టౌన్‌హాలులో గురువారం జరిగాయి. పోటీల్లో పలు జిల్లాలకు చెందిన  క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


జాతీయ స్థాయిలో పతకాలు

పాఠశాల స్థాయిలో ఉన్నప్పట్నుంచి పోటీలకు వెళ్తున్నాను. కండలతో అందంగా ఉండాలనుకుని కండలు పెంచాను. విశాఖపట్నంలో 2010లో జరిగిన పోటీల్లో పాల్గొని బహుమతి సాధించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని 15కు పైగా పతకాలు సొంతం చేసుకున్నాను. గతంలో భీమవరంలో జరిగిన పోటీల్లోనూ విజేతగా నిలిచా.

జి.హేమంత్‌కుమార్‌, విశాఖపట్నం


నిరంతర సాధన

దేహదారుఢ్యపోటీల్లో రాణించాలంటే నిరంతర సాధన చేయాలి. ఉదయం సాయంత్రం వేళల్లో నిత్యం 4 గంటలకు పైగా సాధన చేస్తాను. భీమవరం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర చోట్ల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 6 పతకాలు సాధించాను. 2015కు ముందు కొన్ని ఓటములు గుణపాఠాలు నేర్పాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకు విజేతగా బహుమతులు సొంతం చేసుకుంటున్నాను.

బి.పవన్‌కుమార్‌, ఏలూరు


జాతీయ స్థాయిలో పతకాలు

2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో 10, జాతీయ స్థాయిలో 3, సౌత్‌ ఇండియా పోటీల్లో 2 పతకాలు అందుకున్నాను. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సినీ కథానాయకులు వెంకటేశ్‌, రవితేజ తదితరులకు శరీర సౌష్ఠవ విషయాల్లో సలహాదారునిగా కొనసాగుతున్నాను. యువతను ప్రోత్సహిస్తూ ఉచిత శిక్షణ, సలహాలు ఇస్తుంటాను.

బి.చంద్రశేఖర్‌, విజయనగరం


వ్యాయామం తప్పనిసరి

కండరాల వీరుడుగా ఉండటం అంటే చాలా కష్టం. తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డ్రైఫ్రూట్స్‌, మాంసం, కోడిగుడ్లు తీసుకోవాలి. చిన్నప్పట్నుంచి కూలి పనులకు వెళ్లేవాడిని. రాత్రిపూట నిర్వహించే బడుల్లో చదువుకున్నాను. పనులకు వెళ్లడంతో కండలు బలంగా కనిపించేవి. 2003లో కాకినాడలో జరిగిన పోటీల్లో పాల్గొంటే బహుమతి వచ్చింది. అప్పుడు నా స్నేహితులు ప్రోత్సహించి పలు ప్రాంతాల్లో జరిగిన పోటీలకు తీసుకెళ్లారు. భీమవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర చోట్ల పతకాలు అందుకున్నాను.

జి.వీరబాబు, కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని