logo

లెక్క తగ్గుతోంది!

కంటే కూతుర్నే కనాలి.. మనసుంటే మగాడిలా పెంచాలి. కానీ పుట్టేది ఆడపిల్లని తెలుసుకుని కొందరు గర్భంలోనే చిదిమేస్తుంటే.. మరికొందరు పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా చెత్త కుప్పల్లోకి విసిరేస్తున్నారు.

Updated : 31 Mar 2023 06:03 IST

పడిపోతున్న బాలికల జననాల సంఖ్య

చాప కింద నీరులా భ్రూణ హత్యలు

పోడూరు, పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే

పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి వార్డు

కంటే కూతుర్నే కనాలి.. మనసుంటే మగాడిలా పెంచాలి. కానీ పుట్టేది ఆడపిల్లని తెలుసుకుని కొందరు గర్భంలోనే చిదిమేస్తుంటే.. మరికొందరు పసిగుడ్డును నిర్ధాక్షిణ్యంగా చెత్త కుప్పల్లోకి విసిరేస్తున్నారు. ఆడపిల్లల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో విధంగా అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో జరుగుతున్న ప్రసవాల్లో మగ శిశువులదే పైచేయి అవుతోంది. వెయ్యి మంది మగవారు ఉంటే సగటున 975 మంది ఆడపిల్లలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఓటర్ల పరంగా మహిళలే ఎక్కువగా ఉన్న జిల్లాలో ఆడ శిశువుల తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. లింగ నిర్ధారణ, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, లేనిపోని అపోహలు వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు.

జిల్లాలో ఏటా సుమారు 25 వేల నుంచి 35 వేల కాన్పులు జరుగుతున్నాయి. ఒకరు లేదా ఇద్దరు చొప్పున జననాల్లో సగటున 35 వేల నుంచి 45 మంది శిశువులు పుడుతుంటే వారిలో బాలురే అధికంగా ఉంటున్నారు. ఇదే కొనసాగితే సమస్యలు ఉత్పన్నమవుతాయని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో ప్రతి గర్భిణి, వారి కుటుంబ సభ్యుల కదలికలను గమనిస్తున్నాం. అన్ని స్కానింగ్‌ కేంద్రాల మీద నిఘా కొనసాగుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడినట్లు తెలిస్తే చర్యలు తప్పవు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతాం. అబార్షన్‌ కారణాలను సేకరిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రసవాలకు సంబంధించిన నివేదికపై సమీక్షిస్తున్నాం.

డి.మహేశ్వరరావు, డీఎంహెచ్‌వో, భీమవరం

* గత మూడేళ్లుగా మగ శిశువులే ఎక్కువగా జన్మిస్తున్నారు. కొన్ని ఇళ్లలో బాబు పుడితే ఒక రకంగా.. పాప పుడితే మరో రకంగా చేష్టలు, మాటలతో తల్లులను వేధిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిని అందరూ నియంత్రించాల్సి ఉంది.

ఏం జరుగుతుందంటే..

జిల్లాలో కొన్నిచోట్ల గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చాపకింద నీరులా జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇక్కడ కాకపోతే ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకొని వస్తున్న ఘటనలు లేకపోలేదు. గర్భిణులుగా నమోదైతే వారిని కంటికి రెప్పలా కాపాడాలన్న ఆదేశాలతోపాటు ప్రసవం వరకూ వారి వివరాలు అధికారుల వద్ద ఉండేలా చూడాలి.

* గర్భస్రావాలు జరిగితే అందులో వాస్తవ పరిస్థితిని అధికారులు గుర్తిస్తే కొంత ప్రగతి కనిపించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పరిశీలిస్తే వివిధ కారణాలతో 269 మంది గర్భ విచ్ఛిత్తి చేసుకున్నారు. ఇంకా లెక్కల్లోకి రానివెన్నో అంచనాకు రాలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేటులోనే ఎక్కువగా జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని