logo

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సంఘటనా స్థలంలో మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన మరో మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది.

Published : 31 Mar 2023 04:38 IST

ద్విచక్ర వాహనాన్ని
ఢీకొట్టిన లారీ

 

జోసెఫ్‌ బెంజిమెన్‌, రవి, ఉష (పాతచిత్రాలు)

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సంఘటనా స్థలంలో మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన మరో మహిళ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి మండలం క్రిష్టారం గ్రామానికి చెందిన నక్కా రవి(30) విద్యుత్తు పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. రెండు రోజుల కిందట భార్య ఉష(25)తో కలిసి ద్విచక్ర వాహనంపై తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఉంటున్న తన సోదరి వేల్పుల మేరీ కళావతి ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సోదరి, బావ అనంత్‌కుమార్‌ను కుటుంబ సమేతంగా క్రిష్టారం రావాలని కోరడంతో వారు సరేనన్నారు. దీంతో రవి, అతడి భార్య ద్విచక్ర వాహనంపై.. అనంత్‌కుమార్‌, మేరీకళావతి, వారి కుమారులు జోసెఫ్‌ బెంజిమెన్‌(12), జాయ్‌బాబులు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. జంగారెడ్డిగూడెం బస్టాండ్‌కు చేరుకోగానే.. బెంజిమెన్‌.. ద్విచక్ర వాహనంపై మేనమామ రవితో వెళతానని మారాం చేయడంతో ఎక్కించుకున్నారు. దేవరపల్లి-తల్లాడ జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం విద్యుత్తు ఉపకేంద్రం వద్దకు వచ్చేసరికి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలిలోనే రవి, బెంజిమెన్‌ మృతి చెందగా, ఉషకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను 108లో తొలుత జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రికి, అనంతరం ఏలూరు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది. ఇదిలా ఉండగా తన కుమారుడికి ఏమన్నా అయ్యిందా.. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిద్దాం..   మా బిడ్డ వద్దకు తీసుకెళ్లండి అంటూ జోసెఫ్‌ బెంజిమెన్‌ తల్లి మేరీ కళావతి స్థానికులను ప్రాధేయపడుతూ.. రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

గతంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు.. ఈ ప్రాంతంలో గత ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ద్విచక్ర వాహనంపై వేగవరం కళాశాల నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని వారు ఢీకొట్టారు. నెల వ్యవధిలోనే రెండు ఘోర ప్రమాదాలు జరగడంపై ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు