logo

సాగు చేయాలా వద్దా!

ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. అనుమతులు వచ్చిన వెంటనే గండ్లు పూడ్చే పనులు ప్రారంభిస్తామని మూడేళ్లుగా జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు.

Published : 01 Apr 2023 06:09 IST

ఇసుక కాలువ ఆయకట్టు రైతుల మల్లగుల్లాలు
పోలవరం, న్యూస్‌టుడే

గండికి ఎదురుగా రాళ్లతో నిండిన పొలం

ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. అనుమతులు వచ్చిన వెంటనే గండ్లు పూడ్చే పనులు ప్రారంభిస్తామని మూడేళ్లుగా జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. ఆ మాటలు వినీవినీ విసిగిపోయిన రైతులు ఏటా గండ్లు తాత్కాలికంగా పూడ్చుకుంటున్నా, కొండవాగుల ఉద్ధృతికి అవి ఎక్కడా ఆగడంలేదు. గతేడాది ఆగస్టు 25న ‘ఖరీఫ్‌ వ్యవసాయం ఇంతేనా?’, ‘అటు వరద.. ఇటు వాగులు’ శీర్షికలతో ‘ఈనాడు’లో వచ్చిన కథనాలపై కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ స్పందించారు. వెంటనే పరిశీలించి నివేదిక అందజేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రామకృష్ణ, జలవనరుల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డ్వామా పీడీ రాంబాబులను ఆదేశించారు. వారు ఆగస్టు 26న వచ్చి చూసి వెళ్లడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఇప్పటి వరకూ పనులు ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులకు చెప్పి ప్రయోజనం ఏమిటి.. తలో రూ.వెయ్యి వేసుకుని తాత్కాలికంగా గండ్లు పూడ్చటమా లేక వ్యవసాయం వదిలి వేయడమా అని తర్జనభర్జనలు పడుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం.. ఇసుక కాలువ గండ్ల విషయమై జలవనరుల శాఖ ఈఈ రమేష్‌బాబును సంప్రదించగా రూ.1.50 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మరి సమయం దగ్గర పడుతోందన్న విషయాన్ని ప్రస్తావించగా తమ శాఖ పరిధిలో నిధులు లేవన్నారు. 

పోలవరం సమీపంలో కుడిగట్టుకు పడిన గండి

మూడు గండ్లు

కొండలపై నుంచి మెత్తప్పకోట, సున్నాలగండి మీదుగా మైదాన ప్రాంతానికి వచ్చి పడే వాగుల ఉద్ధృతికి పోలవరం సమీపంలోని ఇసుక కాలువ కుడిగట్టుకు మూడు చోట్ల గండ్లు పడుతున్నాయి. మూడేళ్లుగా ఏటా ఈ తంతు జరుగుతూనే ఉంది. గతంలో గండ్లు పడిన వెంటనే అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేయించి అడ్డుకట్ట వేసేవారు. 2019, 2020లో గండ్లు పూడ్చే పనులకు జలవనరుల శాఖ అధికారులు బిల్లులు చేసినా మంజూరు కాకపోవడంతో ఇక పనులు చేయడం మావల్ల కాదంటూ గుత్తేదారులు చేతులెత్తేశారు. దాంతో గట్టు పక్కనున్న రైతులే ఎంత పటిష్ఠంగా గండ్లు పూడ్చినా, వాగుల ధాటికి ఆగడం లేదు. కారణం గట్టుకు ఆనుకుని ఎడమ వైపు పునరావాస కాలనీలు నిర్మించడంతో వాగు ఉద్ధృతి అంతా కుడిగట్టుపైనే పడుతోందని, అక్కడ కాంక్రీట్‌ గోడ నిర్మించకపోతే పచ్చని పొలాలు ఎందుకూ పనికి రావని రైతులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని