logo

మళ్లీ అడ్డగోలు బదిలీలు

వైద్య ఆరోగ్య శాఖలో మళ్లీ అడ్డగోలు బదిలీలకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏఎన్‌ఎంలను రీ డిప్లాయ్‌మెంట్‌ బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకుని కాసులు పండించుకుంటున్నారు.

Published : 01 Apr 2023 06:09 IST

డిప్లాయ్‌మెంట్‌ పేరిట అక్రమాలకు రంగం సిద్ధం
ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే

వైద్య ఆరోగ్య శాఖలో మళ్లీ అడ్డగోలు బదిలీలకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏఎన్‌ఎంలను రీ డిప్లాయ్‌మెంట్‌ బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మలచుకుని కాసులు పండించుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. గతేడాది డిసెంబరులో రీ డిప్లాయ్‌మెంట్‌ పేరుతో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సీనియర్‌ ఏఎన్‌ఎంలను బదిలీ చేశారు. అప్పట్లో పలు అక్రమాలు జరిగాయి. సొమ్ములిచ్చిన వారికి కోరుకున్న చోటుకు, మిగిలిన వారిని ఎక్కడెక్కడికో దూరప్రాంతాలకు బదిలీ చేశారు. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. మళ్లీ నాలుగు నెలలు తిరగకుండానే ఇప్పుడు రెండో విడతలో 80 మందిని రీ డిప్లాయ్‌మెంట్‌ కోటాలో బదిలీ చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. అప్పట్లో చక్రం తిప్పిన ఉద్యోగే మళ్లీ అన్నీ తానై అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శ వినిపిస్తోంది.

జాబితాలు సిద్ధం.. ప్రాధాన్య జాబితాలు వారం రోజుల కిందటే తయారు చేసి ఎవరెవరు ఎక్కడెక్కడనేది ఇంచుమించుగా ఖరారు చేసినట్లు తెలిసింది. మొదటిసారి రీడిప్లాయ్‌మెంట్‌లో దూరప్రాంతాలకు వెళ్లిన కొంతమందిని మళ్లీ ఈ జాబితాలో చేర్చడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మొదటి విడత బదిలీలు జరిగిన వారిని రెండో విడతలో చేర్చేందుకు వీలుండదు. కొత్త వారికే ఇప్పుడు అవకాశముంటుంది. కానీ మొదటి విడత బదిలీలు జరిగిన వారిలో 13 మందిని జాబితాలో చేర్చారు. అది కూడా జాబితాలో వారికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. ఇందుకు వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలిసింది.

తాయిలాలు తప్పనిసరి

దూర ప్రాంతాలకు వెళ్లలేక దగ్గరగా వేయించుకునేందుకు పలువురు ఏఎన్‌ఎంలు చక్రం తిప్పుతున్న ఉద్యోగిని ప్రసన్నం చేసుకుంటున్నారు. మొదటి విడత బదిలీల్లో దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఇప్పుడున్న వాళ్లు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఈ కారణంగా డిమాండ్‌ పెరగడంతో రేటు పెంచి రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఒక్కొక్కరి వద్ద వసూలు చేస్తున్నట్లు సమాచారం. సీనియారిటీ లిస్టును తనకు ఇష్టం వచ్చినట్లు మార్చేసి అనుకూలమైన వారి పేర్లను ముందు వరుసలో ఉండేలా చూస్తున్నారు. ఈ క్రమంలో పలువురు అడిగినంత సొమ్ములిచ్చి కోరుకున్న చోటకు బదిలీ జరిగేలా పావులు కదుపుతున్నారు.

ఆరోపణల నేపథ్యంలో మార్చినా..

మొదటి విడత బదిలీల్లో పలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు రావడంతో వైద్య ఆరోగ్య శాఖలో కీలక స్థానాల్లో ఉన్న ముగ్గురు ఉద్యోగులను బదిలీ చేశారు. వారిలో ఒకరు కామవరపుకోట ప్రాంతానికి బదిలీ అయ్యారు. తాజాగా రెండో విడత బదిలీల్లో ఆయనే మళ్లీ చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఇందుకు 15 రోజులుగా డీఎంహెచ్‌వో  కార్యాలయంలో తిష్ఠ వేసి జాబితా తయారు చేసినట్లుగా చెబుతున్నారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా.. ఇక్కడ ఆయనకు పనేంటని పలువురు ఉద్యోగులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు.


పారదర్శకంగా నిర్వహిస్తాం

రీ డిప్లాయ్‌మెంట్‌ బదిలీల్లో ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇంకా కౌన్సెలింగ్‌ తేదీలు ప్రకటించలేదు. ప్రాధాన్యం ప్రకారమే బదిలీలు జరుగుతాయి. తగిన విధంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి ఐచ్ఛికాలు ఎంపిక చేసుకునే విధంగా ఏఎన్‌ఎంలకు అవకాశం కల్పిస్తాం.

డాక్టరు ఆశ, డీఎంహెచ్‌వో, ఏలూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని