logo

ఏఎస్సై దూషించారంటూ ఆందోళన

ఉండిలో చిన్నవంతెన కూడలి వద్ద జాతీయ రహదారి పక్కన ఆగిన ఆటోను శుక్రవారం ఆర్టీసీ బస్సు తాకిన ఘటన వివాదానికి దారి తీసింది.

Published : 01 Apr 2023 06:09 IST

టవర్‌ ఎక్కిన ఆటో చోదకుడు

టవర్‌పై సూరి

ఉండి, న్యూస్‌టుడే: ఉండిలో చిన్నవంతెన కూడలి వద్ద జాతీయ రహదారి పక్కన ఆగిన ఆటోను శుక్రవారం ఆర్టీసీ బస్సు తాకిన ఘటన వివాదానికి దారి తీసింది. రాంగ్‌ రూట్‌లో వచ్చిన బస్సు డ్రైవర్‌ను వదిలేసి ఏఎస్సై తనను, కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించి తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఉండికి చెందిన ఆటో చోదకుడు దువ్వి సూరి మండల రెవెన్యూ కార్యాలయంలో వైర్‌లెస్‌ టవరెక్కి ఆందోళనకు దిగారు. స్థానికులు, అతడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రెవెన్యూ, పోలీసు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని కిందకు దిగాలని నచ్చజెప్పారు. ఏఎస్సై ప్రవర్తనతో తాను మనస్తాపం చెందానంటూ అతడు మరింత పైకి వెళ్లడంతో అక్కడి వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ దశలో ఆర్‌ఐ ఆంజనేయులు అతడితో చరవాణిలో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏఎస్సైను అక్కడికి రప్పించారు. తరువాత సూరి టవర్‌పై నుంచి దిగి రావడంతో గ్రామ ప్రముఖుల సమక్షంలో ఆర్‌ఐ ఆంజనేయులు అతడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఏఎస్సైతో మాట్లాడించారు. అనంతరం నరసాపురం వెళ్తున్న నాగాయలంక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. సుమారు గంటపాటు ఈ వ్యవహారం కొనసాగడంతో బస్సులో ప్రయాణికులు ఇబ్బందులు చవిచూశారు.

ఘటనా స్థలంలో విలపిస్తున్న సూరి కుటుంబ సభ్యులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని