logo

ఆర్టీసీ బస్సులో భారీ చోరీ

దొంగలపై పోలీసులు నిఘా పెడుతున్నా చోరీలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పెనుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తాజాగా జరిగిన భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 01 Apr 2023 06:05 IST

850 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదు మాయం
దొంగల కోసం వేట

నిఘా విభాగం, న్యూస్‌టుడే: దొంగలపై పోలీసులు నిఘా పెడుతున్నా చోరీలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పెనుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తాజాగా జరిగిన భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ బస్సులో సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై వస్తువులు పోగొట్టుకున్న బంగారు వ్యాపారి ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీసులు మార్చి 28న కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరుకు చెందిన ఒక బంగారు వ్యాపారి రాజమహేంద్రవరంలో ఉంటున్న తన గుమస్తాకు కొన్ని బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగు ఇచ్చి పాలకొల్లు పంపించారు. సదరు గుమస్తా పాలకొల్లు, నరసాపురంలలో పని ముగించుకుని.. 850 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు బ్యాగులో పెట్టుకుని మార్చి 27న సాయంత్రం పాలకొల్లులో రాజమహేంద్రవరం వెళ్లే బస్సు ఎక్కారు. పెనుగొండ గ్రామంలో సిద్ధాంతం రోడ్డుకు చేరుకున్న తర్వాత ఆభరణాల బ్యాగు మాయమైనట్లు గుర్తించారు. అదే రోజు అర్ధరాత్రి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భారీ చోరీని పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఎనిమిది బృందాలతో దొంగల కోసం వేట ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటికే కొంత వరకు ఆధారాలు లభించాయని, త్వరలోనే కేసును ఛేదిస్తామని ఒక పోలీసు అధికారి వెల్లడించారు.

మహిళ నుంచి ఆభరణాల అపహరణ

పెనుమంట్ర, న్యూస్‌టుడే: బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ లగేజీ బ్యాగు నుంచి బంగారు ఆభరణాలు, నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రావులపాలెం - పెనుమంట్ర మండలం పొలమూరు మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. పొలమూరు గ్రామానికి చెందిన పసుమర్తి లక్ష్మీసూర్యకుమారి రావులపాలెం నుంచి మార్చి 29న ఆర్టీసీ బస్సులో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ సందర్భంలో బ్యాగులో సుమారు 10 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు ఉంచారు. సుమారు గంటన్నర సమయం ప్రయాణించి పొలమూరు చేరుకున్న ఆమె బ్యాగును పరిశీలించారు. అందులో ఉంచిన ఆభరణాలు, నగదు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. చోరీకి గురైన ఆభరణాల్లో నల్లపూసల తాడు, హారాలు, గొలుసులు, ఉంగరం, చెవి దిద్దులు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర కుమార్‌ శుక్రవారం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని