logo

సహకారం అంతా అయోమయం

ఉపాధ్యాయులకు ఆర్థిక దన్నుగా ఉంటుందనుకున్న సహకార సంఘం పరిస్థితి నేడు అయోమయంగా మారింది. ఏళ్లుగా ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆర్థిక దన్నుగా నిలిచిన మండవల్లి- ముదినేపల్లి టీచర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లావాదేవీలు నిలిచి అగమ్యగోచరంగా మారింది.

Published : 01 Apr 2023 06:09 IST

ఉపాధ్యాయ కోఆపరేటివ్‌ సొసైటీలో రూ.55 లక్షల గోల్‌మాల్‌?
రుణం చెల్లించినా నోటీసులు
ముదినేపల్లి, న్యూస్‌టుడే

ముదినేపల్లి సహకార బ్యాంకు

ఉపాధ్యాయులకు ఆర్థిక దన్నుగా ఉంటుందనుకున్న సహకార సంఘం పరిస్థితి నేడు అయోమయంగా మారింది. ఏళ్లుగా ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆర్థిక దన్నుగా నిలిచిన మండవల్లి- ముదినేపల్లి టీచర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లావాదేవీలు నిలిచి అగమ్యగోచరంగా మారింది. రూ.లక్షల రికవరీ నిలిచిపోవడంతో జిల్లా అధికారులు విచారణకు సిద్ధమయ్యారు.  కాగా, రుణ గ్రహీతల్లో చాలామంది తీసుకున్న రుణం తిరిగి చెల్లించామని, ఇప్పుడు బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించిన రుణం ఖాతాల్లో జమచేయకుండా సొసైటీ పాలకవర్గం తమను నిండా ముంచిందని ఆరోపిస్తున్నారు.

గతమెంతో ఘనం

మండవల్లి, ముదినేపల్లి మండలాల పరిధిలోని ఉపాధ్యాయులంతా కలిసి సుమారు 40 ఏళ్ల కిందట టీచర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీగా ఏర్పడ్డారు. దీనిద్వారా సహకార బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని సులభ వాయిదాల్లో చెల్లించేవారు. సుమారు 200 మంది వరకు సభ్యులు ఉన్నారు. 2016 వరకు సుమారు రూ.4 కోట్ల మేర లావాదేవీలు జరిగాయి. అప్పటి వరకు సంఘం రూ. 2.13 లక్షల లాభాల్లో ఉండటంతో పాటు రూ. 20 లక్షలు విలువ చేసే స్థలం ఉన్నట్లు ఆడిట్‌ నివేదికల్లో తేలింది. ఆ తర్వాత వచ్చిన నూతన కార్యవర్గం రుణాల వసూళ్లపై కార్యవర్గం శ్రద్ధ చూపకపోవడంతో వడ్డీ రూపంలో పెనుభారం పడినట్లు గత ఆడిట్ నివేదికలో తేలింది.

ఎవరు బాధ్యులు..?

మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు తీసుకున్న రుణాన్ని 2017లోనే తిరిగి చెల్లించారు. ఆరేళ్ల తర్వాత రుణం చెల్లించాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో అవాక్కయ్యారు. సంఘ పరిధిలో సుమారు 61 మంది ఉపాధ్యాయులకు సంబంధించి రుణ చెల్లింపు గడువు ముగిసినట్లు బ్యాంకు అధికారులు విద్యా శాఖాధికారులకు జాబితా అందించారు. బదిలీలపై ఇతర మండలాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు.

గుట్టు చప్పుడు కాకుండా..

సొసైటీలో రెండు ప్రధాన సంఘాల నాయకులు ఈ గోల్‌మాల్‌ వ్యవహారం బయటకు రాకుండా కొన్ని నెలలుగా నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. సొసైటీ దాదాపు రూ.55 లక్షల మేర  బ్యాంకుకు అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నో నెలలుగా రికవరీ లేకపోవడంతో దీనిపై విచారణాధికారిని నియమించారు. ఈ విషయమై సొసైటీ అధ్యక్షుడు ఆగొల్లు హరికృష్ణ మాట్లాడుతూ 2021 ఆడిట్ తదుపరి ఇప్పటివరకు సుమారు రూ.27 లక్షలకు పైగా సభ్యుల నుంచి వసూలు చేసి బ్యాంకుకు జమచేశామన్నారు. అయితే వారి పేర్లను బ్యాంకు అధికారులు రికవరీ చేయాల్సిన జాబితాలో చేర్చారన్నారు. ఇంకా 14 మంది ఉపాధ్యాయులకు సంబంధించి ఈపీల రూపంలో సుమారు రూ.45 లక్షలు, మృతి చెందిన మరో ముగ్గురు ఉపాధ్యాయులకు సంబంధించి సుమారు రూ.10 లక్షలు వసూలు కావాల్సి ఉందని తెలిపారు.


చెల్లింపుల బాధ్యత పాలకవర్గానిదే..

ఉపాధ్యాయ సొసైటీ నుంచి వడ్డీ కాకుండా అసలు రూ.55 లక్షల మేర బకాయిలున్నాయి. దీనికి సంబంధించి మండవల్లి, ముదినేపల్లి మండలాల ఎంఈవోలకు సంబంధిత ఉపాధ్యాయుల ఖాతాల నుంచి మినహాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని నాలుగు నెలల కిందటే జాబితాలు పంపించాం. కొంత మంది రుణం చెల్లించామంటూ వస్తున్నా వారి వద్ద సరైన రసీదులు లేవు. రుణ బకాయిల చెల్లింపు బాధ్యత పాలవర్గంపైనే ఉంటుంది.

వీవీఎల్‌ఎస్‌ కుమార్‌, కేడీసీసీ బ్యాంకు మేనేజరు, ముదినేపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని