logo

యాప్‌.. బెట్టింగ్‌ గప్‌చుప్‌!

ఉమ్మడి జిల్లాలో క్రికెట్‌ బెట్టింగులు, జూదాల సంస్కృతి కొత్త పుంతలు తొక్కుతోంది. భీమవరం కేంద్రంగా కథ నడుపుతున్న బుకీలు పోలీసులకు చిక్కకుండా నూతన సాంకేతిక విధానాలను వినియోగిస్తున్నారు

Updated : 18 May 2023 05:35 IST

కొత్త పుంతలు తొక్కుతున్న జూదం
పోలీసులకు చిక్కకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం

నరసాపురం, భీమవరం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో క్రికెట్‌ బెట్టింగులు, జూదాల సంస్కృతి కొత్త పుంతలు తొక్కుతోంది. భీమవరం కేంద్రంగా కథ నడుపుతున్న బుకీలు పోలీసులకు చిక్కకుండా నూతన సాంకేతిక విధానాలను వినియోగిస్తున్నారు. గత నెల రోజులుగా ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు బుకీలకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రధాన బుకీలు దేశంలోని పలు పట్టణాలను కేంద్రంగా చేసుకుని వ్యాపారం చక్కబెడుతున్నారు. వీటి నిర్వహణకు ఇతర పట్టణ, గ్రామస్థాయిల్లో ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ఏ మాత్రం కష్టం, పెట్టుబడి లేకపోవడం, స్వల్ప కాలంలోనే రూ.లక్షలు ఆర్జించవచ్చనే అత్యాశతో పలువురు యువకులు ప్రధాన బుకీలకు సబ్‌ బుకీలుగా మారుతున్నారు. ఇటువంటి వారిలో కొంత మందికి రాజకీయ నేపథ్యం ఇతర అండదండలు ఉండటం కూడా కలిసి వస్తోంది. గతంలో నగదు లావాదేవీలు నిర్వహించేవారు. దాన్నుంచి క్రమంగా ఫోన్‌ పే, గూగుల్‌పే, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటి వాటివైపు మళ్లారు. ఈ విధానంపై కూడా పోలీసు అధికారుల నిఘా ఉండటం, పట్టుబడటం వంటివి చోటుచేసుకోవడంతో నూతన సాంకేతిక విధానాలను వినియోగిస్తున్నారు.

చేతులు మారుతున్న భారీ మొత్తాలు.. బుకీలు వారి ఆధారాలు లేకుండా వివిధ నెట్‌వర్కులకు సంబంధించిన (ప్రూఫ్‌లెస్‌) సిమ్‌ కార్డులు సంపాదిస్తున్నారు. వాటిని వినియోగించి బెట్టింగ్‌రాయుళ్లతో గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన బుకీలు వినియోగంలోకి తీసుకువచ్చిన యాప్‌లకు సంబంధించిన లింకులను సబ్‌బుకీలు ఆయా గ్రూపు సభ్యులకు పంపుతున్నారు. జూదరులు దానికి పాస్‌వర్డు మార్చుకుని ఆయా యాప్‌ల ద్వారా బెట్టింగ్‌కు నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పీసీఎస్‌, వీఎల్‌, కొవ్వూరి 777, క్విక్‌ 777, వరల్డ్‌ 777 తదితర యాప్‌లు వినియోగిస్తున్నారు. వాటి ద్వారా క్రికెట్‌, పేకాట, గుర్రపు పందేలు (మినీక్యాసినో) తదితర జూదాలు నిర్వహిస్తున్నారు. యాప్‌లతో బెట్టింగులకు పాల్పడే వారికి నిర్వాహకులు ఐదు నుంచి పదిశాతం వరకూ బోనస్‌ రూపంలో అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రతిరోజూ ఇలా లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి.  

చట్టవ్యతిరేక కార్యక్రమాలను ఉపేక్షించేది లేదు.. ‘క్రికెట్‌ బెట్టింగులు, జూదాలు వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు. బెట్టింగ్‌లతో చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వీటి నివారణకు మేము ప్రత్యేక చర్యలు చేపట్టాం. పీసీఎస్‌, వీఎల్‌, కొవ్వూరి 777, క్విక్‌ 777, వరల్డ్‌ 777 తదితర యాప్‌లను వినియోగంలోకి తీసుకువచ్చిన బుకీలు, వినియోగిస్తున్న సబ్‌బుకీలు, బెట్టింగ్‌ రాయుళ్లపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాం. ప్రజలు కూడా బాధ్యతగా ఇటువంటి వారి సమాచారం మాకు తెలియజేస్తే వేగంగా.. నూరుశాతం కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది’ అని పశ్చిమ ఎస్పీ రవిప్రకాశ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని