logo

తరలింపునకు నరకయాతన

‘నూక పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు. ధాన్యం దిగుమతిలో ఇబ్బంది పెడితే సహించం.. ధాన్యం ఆర్బీకేకు అప్పగించే వరకూ రైతు బాధ్యత.

Published : 02 Jun 2023 04:13 IST

పశ్చిమ ధాన్యం తూర్పుగోదావరి మిల్లులకు
ఆగని రవాణా,   వెయిటింగ్‌ ఛార్జీల బాదుడు  
మంత్రి నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
ఈనాడు డిజిటల్‌, ఏలూరు, తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే

ఇంకా కల్లాల్లోనే ఆరబోస్తున్న ధాన్యం

‘నూక పేరుతో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు. ధాన్యం దిగుమతిలో ఇబ్బంది పెడితే సహించం.. ధాన్యం ఆర్బీకేకు అప్పగించే వరకూ రైతు బాధ్యత. తర్వాత మిల్లర్లు పిలిచినా వారు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఫోన్‌ చేసి చెప్పండి. వెంటనే పరిష్కరిస్తా.’ ఇదీ కొద్ది రోజుల క్రితం ధాన్యం కల్లాలను పరిశీలించినప్పుడు పౌరసరఫరాల మంత్రి కారుమూరి అన్నదాతలకు ఇచ్చిన భరోసా.

మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉన్నా ఆయన సొంత నియోజకవర్గంలో కూడా పరిస్థితులు చక్కబడలేదు. నూకదోపిడీ షరా మామూలే అన్నట్లు సాగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పండిన ధాన్యం ఉమ్మడి తూర్పుగోదావరిలోని మిల్లులకు కేటాయించడంతో రవాణా చేయడం తలకు మించిన భారమవుతోంది.

ఉమ్మడి పశ్చిమలో ధాన్యం మిల్లుల కేటాయింపు రైతులకు   భారంగా మారింది. ప్రస్తుతం ఇరగవరం, అత్తిలి, తణుకు తదితర మండలాల్లో ధాన్యాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, తుని, అనపర్తి, రాజోలు, కాకినాడ ఇలా దూర ప్రాంతాల్లోని మిల్లులకు కేటాయిస్తున్నారు.  ధాన్యం రవాణాకు రైతులు తంటాలు పడుతున్నారు. స్థానికంగా మిల్లులకు ఇస్తే ట్రాక్టర్ల ద్వారా తరలించేవారు. దూరం కావడంతో తప్పనిసరిగా లారీ ఉండాల్సిందే.  సరిపడా ధాన్యం ఉంటేనే లారీ డ్రైవర్లు రవాణా చేస్తున్నారు. ధాన్యం సంచుల్లో నింపి వారాలు గడుస్తున్నా రవాణా కావటం లేదు. ఈ అవస్థలు పడలేక కొందరు రైతులు తక్కువ ధరకే దళారులకే అమ్ముతున్నారు. అత్తిలి మండలానికి చెందిన త్రిమూర్తులు కౌలు రైతు. 110 సార్ల ధాన్యం వర్షాలకు ముందే సిద్ధంగా ఉంది. అధికారుల చుట్టూ తిరిగినా వాహనం పెట్టలేదు. దీంతో విసిగిపోయి సారకు రూ.30 తగ్గించి విక్రయించారు. ఇలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. అధికారులు మాత్రం స్థానిక మిల్లుల నిల్వ సామర్థ్యం పూర్తి కావటంతో దూర ప్రాంతాల మిల్లులకు కేటాయిస్తున్నామని చెబుతున్నారు.

దోపిడీ మామూలే

ప్రభుత్వ లెక్కల ప్రకారం ధాన్యం తరలించేందుకు టన్నుకు రూ.330 మాత్రమే ఇస్తారు. ఇతర జిల్లాల మిల్లులకు కేటాయించడంతో డ్రైవర్లు టన్నుకు రూ.1000 వరకూ వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. రవాణా ఛార్జీలతో పాటు మిల్లులో ధాన్యం దించకపోతే వెయిటింగ్‌ ఛార్జీల పేరుతో రోజుకు రూ.1000 వసూలు చేస్తున్నారు. ఇంతా చేసి ధాన్యం దించుకున్నా నూక పేరుతో 41 కేజీలకు 3 కేజీల వరకు అదనంగా తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల బస్తాకు రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. నూక శాతం ఎక్కువగా ఉందని సమీపంలోని బాయిల్డ్‌ మిల్లుకు తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఆయా మిల్లుల్లో నూక శాతం తగ్గితే మరి నూక దోపిడీ ఎందుకు జరుగుతుందో అర్థంకాదు. మిల్లులు దూరంగా కేటాయించడంతో అదనపు భారం పడుతోందని..అధికారులు వాహనాలు ఏర్పాటు చేయాలని రైతులు బుధవారం ఇరగవరం తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ అంశంపై జేసీ రామసుందర్‌రెడ్డిని వివరణ కోరగా ‘స్థానిక మిల్లుల లక్ష్యం పూర్తికావడంతో ఇతర జిల్లాల్లోని మిల్లులకు కేటాయిస్తున్నాం. రైతులకు రవాణా సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.


రవాణా చేసే నాథుడు లేరు

మూడెకరాల్లో కౌలు సాగు చేశా. పంట కోసి రెండు వారాలైంది. సకాలంలో సంచులు ఇవ్వక ఇబ్బందులు పడ్డాం. ధాన్యం తూసి పది రోజులైంది. పక్క జిల్లాల మిల్లుల కేటాయించడంతో వాహనదారులు ముందుకు రావడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. ధాన్యం రహదారి పక్కన ఉంచి కాపలా కాస్తున్నా. వర్షం ఎప్పుడు వస్తుందో అని భయంగా ఉంది.

జనార్దనరావు, వేండ్రవారిపాలెం, ఇరగవరం


23 రోజులైనా దిక్కులేదు

3.5 ఎకరాల్లో కౌలు సాగు చేశా. పంట చేతికొచ్చి 23 రోజులైంది. పక్క జిల్లాలో మిల్లు కేటాయించడంతో వాహనదారులు టన్నుకు రూ.1000 అడుగుతున్నారు..వెయిటింగ్‌ ఛార్జీలు రోజుకు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఇన్ని రోజులైనా అధికారులు రవాణా సౌకర్యం కల్పించలేదు. దీంతో రాత్రీపగలు కాపలా కాస్తున్నాం.

దానేశ్వరరావు, వేండ్రవారిపాలెం, ఇరగవరం


టన్నుకు రూ.వెయ్యి ఇవ్వాలి

నాలుగెకరాలు కౌలుకు సాగు చేశా. పది రోజుల క్రితం ధాన్యం సిద్ధం చేశా. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మిల్లు కేటాయించారు. రవాణా ఛార్జీలు టన్నుకు రూ.1000 వరకు అవుతాయి. గత ఏడాది రవాణా చేసిన ధాన్యం నగదే ఇంకా రాలేదు. అక్కడ వెంటనే దించుకోకుంటే వెయింటింగ్‌ ఛార్జీలు కట్టాలి. నూక పేరుతో రెండు కేజీలు అదనంగా తీసుకున్నారు.

కృష్ణరాజు, కౌలు రైతు, గోటేరు, ఇరగవరం మండలం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని