logo

చరవాణి జాడ ఇట్టే పట్టేస్తారు.!

దైనందిన జీవనంలో చరవారణి ఓ భాగంగా మారిపోయింది. బుడతలు నుంచి వృద్ధుల వరకు ఖరీదైన మొబైల్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు.

Published : 02 Jun 2023 04:13 IST

‘ఎంఎంటీఎస్‌’ తో మార్గం సుగమం

బాధితుడికి ఫోన్‌ను అందజేస్తున్న ఎసీ మేరీ ప్రశాంతి

కైకలూరు, న్యూస్‌టుడే: దైనందిన జీవనంలో చరవారణి ఓ భాగంగా మారిపోయింది. బుడతలు నుంచి వృద్ధుల వరకు ఖరీదైన మొబైల్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, ప్రభుత్వ పథకాల సమాచారం ఇలా ఒకటేమిటి ఏ రంగంలోనైనా సెల్‌ఫోన్‌ పాత్ర ఎంతో కీలకం. వ్యక్తిగత, విలువైన సమాచారాలను సైతం వినియోగదారులు వీటిలోనే నిక్షిప్తం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో చరవాణుల చోరీలు కూడా పెరిగాయి. ఒక్కసారి చేజారితే ఇక ఆశలు వదులుకోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండేది కాదు. అయితే ప్రస్తుతం ‘మిస్సింగ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌’ (ఎంఎంటీఎస్‌) వ్యవస్థతో చోరీకి గురైన ఫోన్ల ఆచూకీని పోలీసులు త్వరితగతిన కనిపెడుతున్నారు.

సాంకేతికత సాయంతో..

ఎంఎంటీస్‌ను రాష్ట్ర పోలీసు యంత్రాంగం డిసెంబరు 2022న ప్రవేశపెట్టింది. బాధితుల నుంచి వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి చోరీకి గురైన ఫోన్ల జాడను సిగ్నళ్ల ఆధారంగా గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లాలో మొత్తం ఏడు విడతల్లో 821 ఫోన్లను జిల్లా సైబర్‌క్రైం, సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. అయితే దొంగిలించిన వ్యక్తులు ఆ ఫోన్‌ను వినియోగిస్తుంటే సులభంగా గుర్తించవచ్చని.. స్వీచ్‌ఆఫ్‌ చేస్తే కనిపెట్టడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

ఫిర్యాదు ఇలా...

పోగొట్టుకున్న ఫోన్‌ గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ శాఖ ఒక్కో జిల్లాకు ఒక్కో వాట్సాప్‌ నంబరు కేటాయించారు. దీనికి ‘హాయ్‌’ అని సంక్షిప్త సందేశం పంపితే పోలీసు శాఖ నుంచి సేవలకు సంబంధించి లింకు వస్తుంది. దాన్ని ఓపెన్‌ చేయగానే ఫిర్యాదుకు సంబంధించిన దరఖాస్తు ఫారం కనిపిస్తుంది. ఇందులో పేరు, చిరునామా, ఫోన్‌ సంస్థ పేరు, పోయిన తేదీ, ప్రదేశం, కారణం, ఐఎంఈఐ నంబరు, పోయిన చరవాణికి చెందిన బిల్లు, ఆధార్‌ కార్డులను ఫోటోలు తీసి పీడీఎఫ్‌ విధానంలో అప్‌లోడ్‌ చేయాలి. సెల్‌ఫోన్‌ ఆచూకీ తెలియగానే మనం ఇచ్చిన ఫోన్‌ నంబరుకు సమాచారం వస్తుంది.

బిల్లులు లేకుండా కొనుగోలు చేయొద్దు

ప్రజలు బిల్లులు లేకుండా కొత్త సెల్‌ఫోన్లు కొనుగోలు చేయవద్దు. సెకండ్‌ హ్యాండ్‌ చరవాణులు కొనే సమయంలో వాటి సంబంధిచిన పత్రాలు ఉంటేనే కొనుగోలు చేయాలి. రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.

సీహెచ్‌ మురళీకృష్ణ, సీఐ, ఏలూరు క్రైం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని