logo

పోలీసుల కళ్లు గప్పి రిమాండ్‌ ఖైదీ పరారీ

ఓ రిమాండ్‌ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

Published : 02 Jun 2023 04:13 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు: ఓ రిమాండ్‌ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారైన ఘటన రాజమహేంద్రవరం నగరంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బొమ్మూరు సీఐ ఆర్‌.విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ జిల్లా జగన్నాథపురం సమీపంలోని ఏటిమొగ ప్రాంతానికి చెందిన పొన్నాడ రవిశంకర్‌ అలియాస్‌ వీరబాబు ఆరు చోరీ కేసుల్లో నిందితుడు. పలుమార్లు జైలుకు వెళ్లాడు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పలు నేరాలకు పాల్పడిన ఘటనలో పాలకొల్లు కోర్టు 2022 నవంబరు ఒకటో తేదీన పీడీయాక్ట్‌ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ నెల 3వ తేదీన అతన్ని రిమాండ్‌ నిమిత్తం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. గతనెల 31న కేసు వాయిదా నిమిత్తం పాలకొల్లు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ఈ మేరకు భీమవరం ఏఆర్‌ విభాగంలోని ఇద్దరు కానిస్టేబుళ్లు బుధవారం ఉదయం పాలకొల్లు కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. తిరిగి సాయంత్రం బస్సులో రాజమహేంద్రవరం బయలుదేరారు. మార్గమధ్యలో రాజమహేంద్రవరం తాడితోట షల్టాన్‌ కూడలి వద్ద రాత్రి 9.15 గంటలకు దిగారు. అక్కడి నుంచి లాలాచెరువు వైపు వెళ్లే మరోబస్సు ఎక్కి కారాగారం వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో రవిశంకర్‌ పరారయ్యాడు. ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం భీమవరం ఏఆర్‌ విభాగం కానిస్టేబుల్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని